
ఇప్పటి వరకూ ఇరాన్ బలగాలు హర్మూజ్ జలసంధిలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. దాదాపు పాతిక వరకూ సరుకు నౌకలపై దాడికి దిగారు. ఇక పలు దేశాలు కలిసికట్టుగా హర్మూజ్ నుంచి రాకపోకల ప్రారంభానికి ఒత్తిడి తీసుకువస్తామని చెపుతున్నప్పటికీ ఇప్పటి యుద్ధ పరిస్థితిలో ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇరాన్ సానుకూల చర్య ద్వారా హర్మూజ్ మార్గం పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ దౌద్య మార్గాలను, రాజకీయ చర్యలను ,చేపడుతామని తెలిపారు.ఈ క్రమంలో ఆయన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లు స్థాయికి చేరింది.
యుద్ధం ఆరంభం అయిన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే ఇప్పుడు ఇది 50 శాతం పెరుగదలను చవిచూసింది. భారత్ సహా కొన్ని అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు తప్పితే మిగిలిన దేశాల చమురు నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే భారత్ చమురు నౌకల రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా జాప్యం అవుతున్నాయి. ఇరాన్‌లో ఇప్పటివరకూ జరిగిన దాడుల ఘటనలలో మృతుల సంఖ్య 1900 దాటింది, ఇజ్రాయెల్‌లో 20 మంది వరకూ చనిపోగా, గల్ఫ్‌లో దాడులలో పాతిక మందికి పైగా చనిపోయారు. వీరిలో భారతీయులు, పాకిస్థానీయులు కూడా ఉన్నారు. ఇప్పటి దాడుల క్రమంలో అమెరికా సైనికులు 13 మంది హతులయ్యారు.