
మొబైల్ ఫోన్, బైక్ కొనివ్వలేదని చెరువులో దూకాడు ఓ యువకుడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు పవన్(24) . కొత్త బైక్, మొబైల్ ఫోన్ కొనివ్వాలని గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని ఇప్పుడు కొనివ్వలేమని తల్లిదండ్రులు నిరాకరించారు. తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేదన్న మనస్తాపంతో పవన్ రెండు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది.
ఏప్రిల్ 2న ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో పవన్ మృతదేహం శవమై తేలడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. క్షణికావేశంలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబంలో తీరని చీకటిని నింపింది.