Reading Time: 2 minutes
Kishan Reddy: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు.. ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు

కేంద్ర ప్రభుత్వం “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదంలో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందేలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విడుదల చేసిన మొత్తం నిధులనులో రూ.371.91 కోట్లను రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా. మురుగునీటి నిర్వహణ, బహిరంగ మలవిసర్జన రహిత (ODF) హోదాను కాపాడటం వంటి వాటి కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన 247.94 కోట్లను గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు స్థానిక అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం.. కేంద్రం నిధులు విడుదల చేసిన ఈ నిధులను 10 పనిదినాల లోపు రాష్ట్ర ఆర్థిక శాఖ సంబంధిత గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బదిలీలో ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రుణాల రేట్ల ప్రకారం వడ్డీతో కలిపి నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు నిధులను జమ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు

14వ ఆర్థిక సంఘం కింద కేంద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,060 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇక 15వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు 80 శాతం మేర పెరిగి, రూ. 9,050 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా, 14వ, 15వ ఆర్థిక సంఘాల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.14,110 కోట్లు కేటాయించబడ్డాయి. ఇందులో భాగంగా, జనవరి 2026 నాటికి ఇప్పటికే రూ.11,111 కోట్లు విడుదల కాగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం, జనవరి 2026 నుండి రూ. 1,032.42 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడతగా రూ. 619.85 కోట్లు విడుదలయ్యాయి.

భవిష్యత్తు ప్రణాళిక – 16వ ఆర్థిక సంఘం

16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 2026–27 నుండి 2030–31 మధ్య కాలంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి సుమారు రూ. 9,968 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు

గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులను సక్రమంగా విడుదల చేయలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించాయని కిషన్ రెడ్డి గారు విమర్శించారు. తెలంగాణలో రెండేళ్లపాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగించడం వల్ల 2023–24, 2024–25 నిధులు నిలిచిపోయాయని, ఎన్నికల తర్వాతే కేంద్రం వాటిని విడుదల చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.