
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానుల కళ్లు ఇప్పుడు కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌పై పడ్డాయి. ఏప్రిల్ 2వ తేదీన జరగనున్న 6వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పవర్‌ఫుల్ హిట్టర్స్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ హైవోల్టెజ్ మ్యాచ్ జరగబోతుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడటంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి.
పిచ్ రిపోర్ట్:
ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామం అని చెప్పాలి.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లతో కేకేఆర్ బలంగా ఉండగా.. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లతో ఎస్ఆర్‌హెచ్ సమాధానం చెప్పడానికి రెడీ అవుతుంది. పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే, ఈ మ్యాచ్‌లో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డులు:
* ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి.
* 19 మ్యాచులలో కేకేఆర్ విజయం
* 10 సార్లు గెలిచిన ఎస్ఆర్‌హెచ్
* ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు
ఈడెన్ గార్డెన్స్ కంచుకోట:
సొంత మైదానంలో కోల్‌కతా రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ జరిగిన 10 మ్యాచ్‌లలో 7 సార్లు కేకేఆర్ విజయం సాధించగా, కేవలం 3 సార్లు మాత్రమే హైదరాబాద్ టీమ్ గెలిచింది. ఈ రికార్డులు ఆతిథ్య జట్టుకు మరింత జోష్ ని ఇస్తున్నాయి. గత రికార్డులని పరిశీలిస్తే.. హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయి సాధిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో కేకేఆర్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచింది.