
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, ఈ మహత్తర నిర్మాణాన్ని సమయానికి పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగేందుకు వారు చూపిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
Read Also: Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..
మొత్తం 1372 మీటర్ల పొడవు గల డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తవడం పోలవరం ప్రాజెక్టు పురోగతిలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తవడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. అలాగే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, దానిని పునర్నిర్మించడానికి అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లుగా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి… pic.twitter.com/yfwsbBcgyq
— N Chandrababu Naidu (@ncbn) April 2, 2026