Reading Time: 2 minutes
Kkr Vs Srh Playing 11 Pitch Report And Head To Head Ipl 2026 Match Preview

KKR vs SRH Head-to-Head: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లలో ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ టీమ్స్ తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తున్నాయి. ఈ సీజన్‌లో బౌలింగ్‌పై ఏమాత్రం అంచనాలు లేని సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాట్ కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

లియామ్ లివింగ్‌స్టోన్ ఆడుతాడా?:
ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు కీలక ఆటగాళ్ల గైర్హాజరీ పెద్ద సమస్యగా మారింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ కూడా గాయం వల్ల దూరమయ్యాడు. దీంతో గత మ్యాచ్‌లో డెబ్యూ చేసిన డేవిడ్ పేన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగనున్నాడు. విదేశీ ఆటగాళ్ల ఎంపికలో ఎస్‌ఆర్‌హెచ్‌కు కఠిన నిర్ణయం ఎదురవుతోంది. నాలుగో విదేశీ ఆటగాడిగా లియామ్ లివింగ్‌స్టోన్, ఈషాన్ మలింగలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ లేని ఎస్‌ఆర్‌హెచ్ ఎలా ఆడుతుందో చూడాలి.

పావెల్‌కు మరోసారి నిరాశ:
కేకేఆర్ విషయానికి వస్తే కెప్టెన్ అజింక్య రహానే గాయం కలవరపెట్టినా.. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. జట్టు ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌లో లేకపోయినా అతనిపై పూర్తి విశ్వాసం ఉంచారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున కామెరాన్ గ్రీన్
ఆడనుండగా.. రోవ్‌మన్ పావెల్‌కు మరోసారి నిరాశ తప్పదు. ఫిన్ అలెన్, సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని విదేశీ ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.

పిచ్ రిపోర్ట్:
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ముఖాముఖిగా 30 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచులు గెలవగా.. ఎస్‌ఆర్‌హెచ్ 10 గెలిచింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. వేసవి కావడంతో మంచు ప్రభావం తక్కువ ఉంటుంది.

తుది జట్లు (అంచనా):
కేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశి (వికెట్ కీపర్), రింకు సింగ్, రామదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబాని, కార్తిక్ త్యాగి.
ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలిల్ అరోరా, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ/లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ పేన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్.