
సైబర్ నేరస్తులు టార్గెట్ అంతా వృద్ధులపైకి షిఫ్ట్ చేసినట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలు చూస్తే స్పష్టమవుతోంది. రిటైర్డ్ అయిన వాళ్లు, జీవిత చరమాంకంలో ఆర్థిక అండ ఉండేలా బ్యాంకుల్లో సేవింగ్స్ చేసుకున్న వాళ్లనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ అరెస్టుల పేరున అకౌంట్లను ఊడ్చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులకు అవగాహన కల్పించేలా 2026 ఏప్రిల్ 02న సైబర్ జాగ్రూకత దివస్ నిర్వహించారు పోలీసులు.
ఈ సందర్భంగా టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏప్రిల్ నెలను వృద్ధుల సైబర్ అవగాహన మాసంగా ప్రత్యేకంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా.. వృద్ధుల రక్షణ కోసం 281 అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమం #OnlineButUnafraid నినాదంతో చేపట్టారు. ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు శిఖా గోయల్. పోలీసులమని చెప్పి వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు అని బెదిరిస్తే.. ఆందోళన చెందకుండా 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.