Reading Time: 2 minutes

శౌర్యపతకం నుంచి దిగజారి అవినీతి తిమింగలంగా..బీహార్ డీఎస్పీగారి అక్రమాస్తులు చూస్తే దిమ్మతిరగాల్సిందే

Caption of Image.

డీఎస్పీ హోదా.. సేవల్లో శౌర్యపతకం పొందారు.. బుద్ది మాత్రం వక్రబుద్ది..  అక్రమాస్తుల కూడబెట్టడంతో దిట్ట.. ఇదే ఒక సంచలనం అనుకుంటే.. మహిళా ఎస్సై ని బినామీగా  ఆస్తులు కూడబెట్టడం మరో హైలైట్ బీహార్ కు చెందిన  ఓడీఎస్సీ  గారి అక్రమాస్తులు చూస్తూ దిమ్మతిరగాల్సిందే.. తన ఆదాయం కంటే దాదాపు 60 శాతం ఎక్కువ అక్రమాసులు కూడబెట్టాడంటే ఎంతటి అవినీతి అనకొండో తెలుస్తోంది.. వివరాల్లోకి వెళితే.. 
 
బీహార్‌లోని కిషన్‌గంజ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) గౌతమ్ కుమార్‌ అవినీతి వ్యవహారం ఇటీవల ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో, బీహార్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అక్రమాస్తులతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

గౌతమ్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు దాడుల్లో వెల్లడైంది. తన ఆదాయం కంటే దాదాపు 60.27% (సుమారు రూ. 1.94 కోట్లు) అదనంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈవోయూ (EOU) ప్రాథమిక విచారణలో తేలింది. పాట్నాలోని స్పెషల్ విజిలెన్స్ కోర్టు జారీ చేసిన వారెంట్‌తో.. కిషన్‌గంజ్‌లోని ఆయన అధికారిక నివాసంతో పాటు పూర్నియా, పాట్నా, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురితో సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు అధికారులు. 

పూర్నియాలో సుమారు రూ. 2.5 కోట్ల విలువ చేసే 3వేల600 చదరపు అడుగుల నాలుగు అంతస్తుల విలాసవంతమైన భవనంతో పాటు, దాదాపు 25 స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా, ఇతర భారీ ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ పేరుతో బినామీ ఆస్తులు

ఈ అవినీతి కేసులో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన మరో సంచలన అంశం.. మహిళా ఎస్సై బినామీగా ఆస్తులు కూడబెట్టడం. షగుఫ్తా షమీమ్ అనే మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌తో (SI) ఆయనకున్న పదేళ్ల నాటి సంబంధంతో తన అవినీతి సంపాదనలో అత్యధిక భాగాన్ని ఈమెపైనే ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

పూర్నియాలోని ఆషియానా కాలనీలో ఉన్న షగుఫ్తా ఇంటిపై దాడులు చేసిన అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి. ఆమె పేరు మీద కొనుగోలు చేసిన 7 ఖరీదైన ప్లాట్ల పత్రాలు, సుమారు రూ. 60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఈవోయూ స్వాధీనం చేసుకుంది. అలాగే, ఆమె బ్యాంకు ఖాతాలోకి గౌతమ్ కుమార్ భారీగా నగదు బదిలీలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి.

ప్రభుత్వం తీసుకున్న చర్యలు

సోదాల్లో అక్రమాస్తులు ,బినామీ లావాదేవీలకు పక్కా ఆధారాలు లభించడంతో, ఉన్నతాధికారులు ఆయనపై వెంటనే కొరడా ఝుళిపించారు. గౌతమ్ కుమార్‌ను కిషన్‌గంజ్ SDPO-1 బాధ్యతల నుంచి తక్షణమే తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాట్నాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.

గౌతమ్ కుమార్ తో పాటే సహర్సా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) డైరెక్టర్ వైభవ్ కుమార్‌పై కూడా ఈవోయూ దాడులు జరిపి పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించింది. బీహార్‌లో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఈ చర్యలు చోటుచేసుకున్నాయి.

©️ VIL Media Pvt Ltd.