Reading Time: 2 minutes
Tollywood: నా వయస్సు 85 ఏళ్లు.. డైలీ ఓల్డ్ మంక్ తాగుతా.. సీనియర్ నటుడి క్రేజీ కామెంట్స్..

సీనియర్ నటుడు హేమ సుందర్ తన కుటుంబ జీవితం, వ్యక్తిగత దృక్పథం, తన వృత్తిపరమైన ప్రయాణం గురించి సవివరంగా మాట్లాడారు. 85 ఏళ్ల వయస్సులోనూ తాను అత్యంత సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హేమ సుందర్‌కు ఇద్దరు పిల్లలు – ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆయన కుమారుడు రిలయన్స్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థానంలో ఉన్నారని, మంచి ఆదాయాన్ని పొందుతున్నారని తెలిపారు. కుమార్తె బెంగళూరులో నివసిస్తుందని, ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పిల్లలు ఆర్థికంగా బాగా స్థిరపడటంతో, తాను “జీవితంలో ఆఖరి రోజుల్లో సుఖంగా ఉండాలి అంటారు కదా, నేనే ఎగ్జాంపుల్” అని వ్యాఖ్యానించారు. సంపాదించిన వారు ఎవరూ సుఖపడరని, సంపాదించే కొడుకు ఉండటం వల్ల తన చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. తనకు కావాల్సిన ఏది కావాలన్నా కుమారుడు చూసుకుంటాడని, ఓ సందర్భంలో మద్యం అయిపోయిందని చెప్పగానే, ఒకేసారి 10 బాటిళ్లతో కూడిన ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడని చెప్పారు. తాను “ఓల్డ్ మాంక్” రమ్ బ్రాండ్‌ను పరిమితంగా తీసుకుంటానని తెలిపారు.

తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, 85 ఏళ్ల వయస్సులో కూడా తాను వ్యాయామాలు, వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి ఏమీ చేయనని తెలిపారు. తన శరీర శ్రమ చాలా తక్కువని, అనవసరంగా శరీరాన్ని కష్టపెట్టనని, మనసును దుఃఖపెట్టనని ఆయన స్పష్టం చేశారు. తన ప్రస్తుత ఆరోగ్యం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యుపరమైన బలం వల్లేనని ఆయన నమ్ముతారు. గతంలో తాను “క్వార్టర్ బాటిల్” మద్యం తాగేవాడినని, “555” సిగరెట్లు రోజుకు ఒక ప్యాకెట్ (20 సిగరెట్లు) తాగేవాడినని అంగీకరించారు. ఈ అలవాట్లు ఉన్నప్పటికీ, 85 ఏళ్లు ఆరోగ్యంగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. తన సినీ ప్రస్థానం కష్టాలతో కూడుకున్నదని, మద్రాసులో ఉన్నప్పుడు వచ్చే సంపాదన సరిపోయేది కాదని హేమ సుందర్ తెలిపారు. తన భార్య కొంచెం పెద్ద ఇంటి బిడ్డ అని, ఆ రోజుల్లోనే 60 తులాల బంగారంతో పుట్టింటి నుండి వచ్చిందని వెల్లడించారు. అయితే, అవసరాల నిమిత్తం ఆ బంగారం తాకట్టు పెట్టడం, విడిపించలేకపోవడం వంటివి జరిగాయని, చివరికి వైజాగ్ తిరిగి వచ్చేటప్పుడు నల్లపూసలతో ఇంటికి వచ్చామని చెప్పారు. ఈ కష్టకాలంలో తన భార్య ఎంతో సహకరించిందని, ఆమె నగలను పట్టుకుని వేలాడలేదని, పరిస్థితులను అర్థం చేసుకుని వదిలేసిందని ఆయన అన్నారు. తన భార్య తన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జీవితంలో ఎలాంటి బాధాకరమైన సంఘటనలు, అవమానాలు, వివాదాలు పెద్దగా గుర్తులేవని హేమ సుందర్ పేర్కొన్నారు. కొన్ని జరిగి ఉండొచ్చు కానీ, అవి గుర్తుపెట్టుకోదగ్గవి కాదని, తాను ఎంతో ఆనందంగా, అదృష్టవంతుడిని అని భావిస్తున్నానని అన్నారు. “ప్రాప్తం ఉన్నది ఏదైనా మన చేతికి వస్తుంది” అనే తత్వశాస్త్రంపై తనకు నమ్మకం ఉందని, వేషాల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని, పిలిస్తే మాత్రం దైవంగా భావించి వస్తానని, కారు పంపాల్సిన అవసరం లేదని, నడిచి అయినా వస్తానని ఆయన తన నిబద్ధతను తెలియజేశారు. తన జీవితంలో కష్టపడాల్సిన రోజుల్లో కష్టపడ్డానని, ప్రస్తుతం సుఖంగా ఉన్నానని ఆయన అన్నారు.

(హేమ సుందర్ క్లియర్‌గా చెప్పారు.. తను జెనిటికల్ స్ట్రాంగ్ అని.. అందువల్ల ఆయనకు ఎటువంటి అలవాట్లు ఉన్నా ఆరోగ్య సమస్యలు రాలేదు. మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం. వాటికి దూరంగా ఉండండి)

Also Read: ఈ జనరేషన్‌లో అతను అరుదైన వ్యక్తి.. యువ హీరోపై రమాప్రభ ప్రశంసలు