Reading Time: < 1 minute
Amaravati Historic Victory Bjp Ap Chief Madhav Hails Capital Status

PVN Madhav: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయానికి వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, అనేక మంది కృషి ఫలితమే ఈ రోజు సాధ్యమైందని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో గొప్పదని తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత సాధించే ప్రయాణంలో ప్రతి ఒక్కరి సహకారం కీలకమైందని, అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేశారు.

Read Also: Artemis II: చంద్రుని అదృశ్య భాగాన్ని తొలిసారిగా చూడనున్న నలుగురు వ్యోమగాములు.. అపోలో 17 తర్వాత తొలి మానవసహిత యాత్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి అమరావతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని మాధవ్ అభినందించారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా రాజధాని కోసం ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమని అన్నారు. దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా చట్టబద్ధత తీసుకురావడం జరగలేదని, పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అమరేశ్వరుడి ఆశీర్వాదాలు అమరావతిపై ఉన్నాయని, భవిష్యత్తులో ఇది దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. అమరావతి పునాది వేయడం నుంచి ఇప్పటి వరకు రాజధానికి అండగా నిలిచారని ఆయన గుర్తుచేశారు. శంకుస్థాపన సమయంలో దేశవ్యాప్తంగా పవిత్ర జలాలు, మట్టిని తీసుకురావడం ద్వారా ప్రతి భారతీయుడిని ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రాజధాని ఎంపిక కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం రావడం గర్వకారణమని చెప్పారు. మొత్తంగా, అమరావతి చరిత్ర దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా అభివృద్ధి చెందుతుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.