Reading Time: < 1 minute

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో తర్వలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గురువారం అధికార పార్టీ టిఎంసిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలంటూ పిలుపునిచ్చారు. భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా సువేందు అధికారి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సువేందు అధికారితో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ప్రతిరోజూ బాంబు దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో మార్పు రాబోతోందని అన్నారు. భవానిపూర్‌లో కూడా మీకు మార్పు కావాలా, వద్దా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. తమ అభ్యర్థి సువేందు అధికారికి ఓట్లు వేసి గెలిపించాలని.. అప్పుడే భవానిపూర్‌లో కూడా మార్పు వస్తుందని ఆయన అన్నారు.

TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని షా పిలుపునిచ్చారు. ఈసారి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఏ గూండా కూడా అడ్డుకోలేడని అన్నారు. కాగా, సువేందు అధికారి..మరోసారి సిఎం మమతపై పోటీ చేయబోతున్నారు. గత 2021ఎన్నికల్లో దీదీ.. సువేందు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.