Reading Time: 2 minutes

డీఎన్ఏ రిపోర్టుతో నటుడి గుట్టు రట్టు.. ఆ చిన్నారికి తండ్రి రంగరాజేనని నిర్ధారణ!

Caption of Image.

తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు మాధంపట్టి రంగరాజ్. అయితే గత కొంత కాలంగా ఆయన చుట్టూ అల్లుకున్న వివాదంలో కోర్టు షాక్ ఇచ్చింది. తన బిడ్డకు తండ్రి రంగరాజేనని వాదిస్తూ వచ్చిన జాయ్ క్రిజిల్డా తన న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో ఈ వివాదంలో అసలు నిజం బయటపడింది. జాయ్ క్రిజిల్డా కుమారుడు రాఘాకు తండ్రి మాధంపట్టి రంగరాజేనని డీఎన్ఏ రిపోర్టులో తేలింది.

అసలేం జరిగింది?

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిజిల్డా, రంగరాజ్ తమకు సీక్రెట్‌గా పెళ్లయిందని, తాను గర్భవతినని గతంలో సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసి సంచలనం సృష్టించారు. అయితే, రంగరాజ్ ఆమె ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. తనకు, ఆ బిడ్డకు సంబంధం లేదని వాదించడమే కాకుండా, తన పరువుకు భంగం కలిగిస్తోందని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.

రిపోర్టులో ఏముంది?

ఈ రిపోర్టును రిటైర్డ్ జడ్జి పి.ఎన్. ప్రకాష్ సమక్షంలో పరిశీలించగా, రంగరాజే తండ్రి అని నిర్ధారణ అయింది. దీనిపై జాయ్ స్పందిస్తూ.. రాఘా రంగరాజ్ తండ్రి మాధంపట్టి రంగరాజే అని అధికారికంగా తేలింది. నా బిడ్డ విజయం సాధించాడు, న్యాయం గెలిచింది అని భావోద్వేగంతో పోస్ట్ చేశారు. గర్భధారణ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభకు ఈ ఫలితం ఒక ఉపశమనమని ఆమె పేర్కొన్నారు.

నిరాకరించినా తప్పని పితృత్వం..

‘కూకు విత్ కోమలి’ జడ్జిగా, ‘మెహందీ సర్కస్’, ‘పెంగ్విన్’ వంటి సినిమాలతో మాధంపట్టి రంగరాజ్ గుర్తింపు పొందారు. ఆయనకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న జాయ్ క్రిజిల్డా తననను రంగరాజ్ రెండో వివాహం చేసుకున్నాడని, గర్భవతిని అని తెలిశాక వదిలేశారని తెలిపింది.దీనికి రంగరాజ్ ఆమె తనను బెదిరించి పెళ్లి చేసుకుందని గతంలో ఆరోపించారు. ఇప్పుడు సైంటిఫిక్ ఆధారాలతో పితృత్వం నిరూపితం కావడంతో, రంగరాజ్ చట్టపరంగా తన బాధ్యతలను స్వీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

విజయానికి ముందే డిలీట్?

అయితే, జాయ్ ఈ పోస్టును పెట్టిన కొద్దిసేపటికే డిలీట్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం కావడం వల్ల లేదా తదుపరి చర్చల దృష్ట్యా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, తన బిడ్డకు ఒక గుర్తింపు , న్యాయం కావాలన్న ఒక తల్లి పోరాటం ఫలించిందని నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.