Reading Time: < 1 minute
Us Iran Ceasefire Talks Strait Of Hormuz Trump Jd Vance Axios Report

US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్‌లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్‌రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

హార్ముజ్ తిరిగి తెరవడానికి బదులుగా కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒప్పందం గురించి అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. బుధవారం సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు ట్రూత్ సోషల్‌లో కీలక పోస్ట్ పెట్టిన ట్రంప్.. హార్ముజ్ జలసంధి తెరిచి, నౌకాయానాన్ని స్వేచ్చగా అనుమతించినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందని స్పష్టం చేశారు.

Read Also: IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

‘‘హార్ముజ్ జలసంధి తెరిచి ఉన్నప్పుడే కాల్పుల విరమణ పరిశీలిస్తాము, అప్పటి వరకు మేము ఇరాన్‌ను నాశనం చేస్తాము, రాతియుగానికి పంపుతాము’’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే, చర్చల ప్రక్రియను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధారణమైన నివేదికలుగా తోసిపుచ్చింది. టెహ్రాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోయినా, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని తనకు నమ్మకం కలిగితే, రెండు మూడు వారాల్లో యుద్ధం నుండి వైదొలుగుతామని మంగళవారం అన్నారు.

చర్చల గురించిన వివరాలు తెలిసిన వారు చెబుతున్నదాని ప్రకారం.. ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ మధ్యవర్తులతో మాట్లాడినట్లు చెప్పారు. ట్రంప్ అసహనంగా ఉన్నారని, ఒక వేళ ఇరాన్ డీల్ చేసుకోకపోతే ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతాయనే సందేశాన్ని ఇచ్చారు. కొన్ని డిమాండ్లు నెరవేరితే కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయాల్సిందిగా జేడీ వాన్స్‌ను ట్రంప్ ఆదేశించారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికాతో దౌత్యపరమైన చర్చల్ని తోసిపుచ్చారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం లేదని, అమెరికా చర్యల్లో నిజాయితీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.