Reading Time: < 1 minute
పాస్‌పోర్ట్ అక్కర్లేదు.. వీసా అసలే వద్దు! విదేశీ టూర్‌ వెళ్లాలనుందా?

సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా వంటి డాక్యుమెంట్ల కోసం ఎంతో కష్టపడాలి. కానీ మన దేశంలోనే ఒక ఊరు ఉంది. అక్కడ కాలు పెడితే మీరు నేరుగా మరో దేశంలోకి వెళ్లిపోవచ్చు. ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా, వీసా గొడవలు లేకుండా భూటాన్ దేశపు అందాలను ఆస్వాదించే అవకాశం ఆ ఊరు కల్పిస్తోంది. అదే జైగావ్ .

ఎక్కడుంది ఈ ఊరు?

పశ్చిమ బెంగాల్‌లోని అలిపుర్‌దువార్ జిల్లాలో ఉన్న సరిహద్దు పట్టణమే ఈ జైగావ్. ఇది భూటాన్‌లోని ఫుయెంట్‌షోలింగ్ (Phuentsholing) పట్టణానికి ఆనుకుని ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం ఒక భూటాన్ గేట్ మాత్రమే అడ్డుగా ఉంటుంది. భారతీయ పౌరులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే ఈ గేట్ దాటి భూటాన్ సరిహద్దు పట్టణంలోకి ప్రవేశించవచ్చు. కేవలం ఒక ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డు వెంట ఉంటే సరిపోతుంది. జైగావ్‌లో భారతీయుల సందడి ఉంటే, గేట్ అవతల భూటాన్ సంప్రదాయ కట్టడాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక్క అడుగుతో మీరు భారత్ నుంచి భూటాన్‌లోకి ప్రవేశించడం ఒక వింత అనుభూతినిస్తుంది. ఇక్కడ తక్కువ ధరకే భూటాన్ హ్యాండీక్రాఫ్ట్స్, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి. ఇక్కడి లోకల్ మార్కెట్లు పర్యాటకులకు స్వర్గధామం.

సందర్శించాల్సిన ప్రదేశాలు:

భూటాన్ గేట్: ఇది ఈ పట్టణానికి ప్రధాన ఆకర్షణ. దీనిపై ఉండే క్లిష్టమైన చెక్కడాలు భూటాన్ వాస్తుశిల్ప కళకు నిదర్శనం.

కర్బంది మొనాస్టరీ: ఫుయెంట్‌షోలింగ్‌లో ఉండే ఈ బౌద్ధ దేవాలయం నుంచి చూస్తే జైగావ్ పట్టణం, పక్కనే ఉన్న టీ ఎస్టేట్లు అద్భుతంగా కనిపిస్తాయి.

మొసళ్ల పార్క్: ఇక్కడ అరుదైన మొసళ్ల జాతులను చూడవచ్చు.

విమానంలో వెళ్లాలి అంటే ఇక్కడికి బగ్డోగ్రా విమానాశ్రయం దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో జైగావ్ చేరుకోవచ్చు. అదే రైలు ద్వారా అంటే హసిమారా రైల్వే స్టేషన్ జైగావ్‌కు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కేవలం సరిహద్దు పట్టణమైన ఫుయెంట్‌షోలింగ్ చూడటానికి ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. కానీ భూటాన్ లోపలికి వెళ్లి థింపూ, పారో వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం రోజుకు నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజు(SDF) చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో విదేశీ అనుభూతిని పొందాలనుకునే పర్యాటకులకు జైగావ్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్!