Reading Time: 2 minutes
సూపర్ పవర్.. ఒంట్లో కొవ్వును కరిగించే అద్భుతమైన కూరగాయ.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

నేటి ఆధునిక జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు సాధారణమయ్యాయి. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అంతర్గత కొవ్వు పేరుకుపోవడం వంటివి వీటిలో కొన్ని. తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందుతున్న వారికి, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కువ కార్బోహైడ్రేట్ల ఆహారం తీసుకుంటున్న వారికి.. సొరకాయను అద్భుతమైన పరిష్కారంగా సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.. అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను “ఎనిమీ డైట్స్”గా, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను “ఫ్రెండ్లీ డైట్స్”గా గుర్తించాలి. ప్రకృతిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న కూరగాయలలో సొరకాయ అత్యుత్తమమైనదని సొరకాయ అని చెబుతున్నారు.

చాలా మంది సొరకాయను ఒక “పసరు కూరగాయ”గానో లేదా రోగులు మాత్రమే తినే ఆహారంగానో భావిస్తారు. అయితే, సొరకాయ వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే, ప్రతి ఒక్కరూ దీనిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. 100 గ్రాముల సొరకాయ ముక్కలలో 96 శాతం నీటి శాతమే ఉంటుంది. ఈ నీరు మినరల్స్ తో కూడుకుని ఉండటం విశేషం..

పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు:

తక్కువ క్యాలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు: 100 గ్రాముల సొరకాయ ముక్కలలో కేవలం 12 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలోని కార్బోహైడ్రేట్ల శాతం 2.5 గ్రాములు. ప్రోటీన్ 0.3 గ్రాములు, ఫ్యాట్ 0.1 గ్రాములు ఉంటాయి. ఇవి దాదాపు లేనట్లే. ఇది బూడిద గుమ్మడికాయతో సమానంగా అతి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కూరగాయ.

బరువు తగ్గడానికి సహాయం: తక్కువ క్యాలరీలతో పాటు అధిక నీటిశాతం (96 శాతం) ఉండటం వల్ల సొరకాయ ఆకలిని నియంత్రించి, పొట్టను నింపుతుంది. అర కిలో సొరకాయ కూర 60 క్యాలరీలు మాత్రమే అందిస్తుంది. ఇది ఒక చిన్న కాఫీ కప్పుతో పోలిస్తే తక్కువే. కాఫీలో పాలు, పంచదార వల్ల క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. సొరకాయ తక్కువ క్యాలరీలతో నిండిన ఆహారం కాబట్టి, ఎంత తిన్నా బరువు పెరగకుండా, శరీరంలోని కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది.

మధుమేహం నియంత్రణ: తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా సొరకాయ మధుమేహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు అర లేదా ముప్పావు కిలో సొరకాయ కూరను పుల్కాతో కలిపి తినడం ద్వారా పోస్ట్ లంచ్ షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

మూత్రవిసర్జనను పెంచి, యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: సొరకాయ డైయూరిటిక్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. దీనివల్ల శరీరంలోని అధిక నీరు బయటకు పోయి, నీరు నిలవకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (యూరినరీ ఇన్ఫెక్షన్స్), కిడ్నీలో రాళ్లను తగ్గించడానికి కూడా సొరకాయ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఆసిడిటీ నియంత్రణ: సొరకాయలో ఉండే మినరల్స్, నీటిశాతం శరీరంలో క్షార స్వభావాన్ని (ఆల్కలనిటీ) పెంచుతాయి. దీనివల్ల అధిక ఆమ్లత్వం (హైపర్ ఎసిడిటీ), పొట్టలో మంట, అల్సర్ ఫార్మేషన్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పంచదార ఉత్పత్తులు శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచి హాని కలిగించగా, సొరకాయ జ్యూస్ వంటివి క్షార స్వభావాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రసాయనాలు లేని కూరగాయ: సొరకాయ చెట్లకు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి పురుగులు పట్టవు. ఎరువులు కూడా పెద్దగా అవసరం లేకుండానే కాయలు కాస్తాయి. అందువల్ల ఇది సురక్షితమైన, రసాయన రహిత ఆహారం.

సొరకాయను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?..

సొరకాయను కూరగా వండుకుని, లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. జ్యూస్ చేసేటప్పుడు లేత సొరకాయ తొక్కను తీయకుండానే వాడవచ్చు. చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే సొరకాయ కూరలను అలవాటు చేయడం వల్ల వారికి ఇది ఇష్టమైన ఆహారంగా మారుతుంది. సొరకాయను సాంబార్‌లో వేయడమే కాకుండా, ఎక్కువగా కూర వండుకుని తినడం మంచిది.. ఇలా సొరకాయను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..