Reading Time: < 1 minute

హనుమాన్ జయంతి రోజున గుండెను పిండేసిన వీడియో !

Caption of Image.

హనుమాన్ జయంతి రోజున సోషల్ మీడియాలో ఒక వీడియో నెటిజన్ల గుండెను పిండేసింది. 85 ఏళ్ల వృద్ధురాలు చనిపోతే ఒక కోతి ఆమె మృతదేహంపై పడి రోదిస్తున్న హృదయ విదారక ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్ధురాలిపై ఆ కోతి చూపిస్తున్న ప్రేమ చూసి.. అయినవాళ్లే ప్రేమగా చూడని ఈరోజుల్లో ఒక మూగ జీవి అనుబంధం విలువ చాటిచెప్పిందని అభిప్రాయపడ్డారు. మార్చి 30న పార్వతమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది.

కర్ణాటకలోని రాయర దొడ్డి గ్రామంలో కోతులు చాలా ఎక్కువగా ఉండేవి. స్థానికులు ఈ కోతులను ఒక బెడదగా భావిస్తే అదే గ్రామంలో ఉంటున్న పార్వతమ్మ మాత్రం ఆ కోతులకు ఆహారం పెడుతూ.. నీళ్లు తాగిస్తూ వాటి ఆలనాపాలనా చూసుకునేది. కొన్నేళ్ల నుంచి కోతులు ఆమె పెట్టిందే తింటున్నాయి. ఆమెతోనే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా ఒక కోతి మాత్రం ఎప్పుడూ ఆమెతోనే ఉండేది.

85 ఏళ్ల వయసులో మార్చి 30న ఆమె చనిపోయింది. ఆమె అంత్యక్రియల సమయంలో ఒక కోతి ఆమె మృతదేహం దగ్గరే ఉంటూ అక్కడ నుంచి పక్కకు పోలేదు. పార్వతమ్మ చనిపోయినట్లు గ్రహించిన ఆ కోతి ఆ వృద్ధురాలి తలకు తల ఆనించి.. కళ్లు మూసుకుని దు:ఖంతో బాధపడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూపరులను కలచివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మూగ జీవి బాధపడటం చూసి తల్లడిల్లిపోయారు. మూగ జీవాలకు ఉన్న ప్రేమాభిమానాలు మనుషులకు లేకపాయెనే అని నిట్టూర్చారు.

©️ VIL Media Pvt Ltd.