
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఉన్నది కూడా న్యాయవాదులేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని వాళ్లలో ఉన్న ఆలోచనే ఈ వృత్తిని ఎన్నుకునేందుకు దోహదపడిందని అన్నారు. యూనివర్శిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో డుకిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకులుగా కొత్త జీవితాన్ని లా స్టూడెంట్స్ ప్రారంభించబోతున్నారని, లాయర్ ప్రొఫెషనల్ ను ఎంచుకోవడమే సంథింగ్ అని కొనియాడారు. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఎక్కువని, న్యాయవాదులు ఉంటే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందని హరీష్ రావు తెలియజేశారు.
ఏ లక్ష్యంలో ఈ వృత్తిని ఎంచుకున్నారో చివరి వరకు అదే కొనసాగించాలని సూచించారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జైల్లో ఉండేవారు అత్యంత పేదవారని, న్యాయాన్నిపొందలేనివారు ఉన్నారని.. అలాంటి వారి కోసం న్యాయవాదులు పోరాడాలని, అండగా నిలబడాలని, పేదలకు గొంతుకగా నిలబడాలని.. కోరుకుంటున్నానని అన్నారు. ఉద్యమాలకు అణచివేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయని తెలియజేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ వచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి కోసమే హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యంగం మనకిచ్చిన స్వేఛ్చను హరించేందుకు హేట్ స్పీచ్ బిల్లు అని విమర్శించారు. లాయర్లు స్వేచ్ఛను కాపాడగలిగితేనే జడ్జిమెంట్ లు న్యాయంగా వస్తాయని, రాజ్యాంగాన్ని లోబడే చట్టాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు.. తప్పిదాన్ని నిలదీస్తే జైలు అని హరీష్ రావు దుయ్యబట్టారు.