Reading Time: < 1 minute
Ts Sa2 Exam Revised Schedule Classes 1 To 9 New Dates

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-2) పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయి. సాధారణంగా ఏప్రిల్ రెండో వారంలో జరగాల్సిన ఈ పరీక్షలు, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిర్వహించే పరీక్షల తేదీలతో విభేదించకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి.. గతంలో ప్రకటించిన తేదీల కంటే రెండు రోజుల ముందే వార్షిక పరీక్షలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

ఏప్రిల్ 8 నుంచి ఈ పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 18వ తేదీతో అన్ని తరగతుల పరీక్షలు పూర్తవుతాయి. 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సైన్స్ (సైన్స్ పేపర్-1, పేపర్-2) పరీక్షల సమయం విషయంలో మార్పు ఉంది. ఈ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. మిగిలిన తరగతుల సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు.

Also Read:SRH vs KKR: క్లాసెన్ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్‌ 227 పరుగులు..

ప్రాథమిక స్థాయి (1 నుంచి 5వ తరగతి) విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక ప్రత్యేక సూచన జారీ చేసింది. ఎవరైతే తమ మొదటి భాషగా తెలుగును ఎంచుకోలేదో (ఉదాహరణకు ఉర్దూ లేదా ఇతర భాషా మాధ్యమాల వారు), అటువంటి విద్యార్థులకు తెలుగును రెండో భాషగా పరిగణించి పరీక్ష నిర్వహిస్తారు. దీనివల్ల ప్రతి విద్యార్థికి తెలుగు భాషపై కనీస అవగాహన ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.

పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు వివరించడానికి విద్యాశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 23న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల మార్కులు, వారి వార్షిక ఫలితాలను ప్రకటించి, వేసవి సెలవుల అనంతరం తదుపరి విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను వివరిస్తారు.