
తెలంగాణలోని సినిమా థియేటర్ల నిర్వహణలో ఏప్రిల్ 3, 2026 నుంచి ఒక కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటివరకు నడుస్తున్న రెంటల్ విధానంలో స్థానంలో, ఇకపై పర్సంటేజీ విధానం రాబోతోంది. దీని ప్రకారం సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది.
ఏమిటీ నిర్ణయం?
సాధారణంగా థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్దె తీసుకుని సినిమాలు ప్రదర్శిస్తుంటారు. అయితే, మారుతున్న కాలంలో థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రేక్షకుల రాక తగ్గడం వంటి కారణాలతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి, 23 ప్రధాన థియేటర్ల ఎగ్జిబిటర్లు అగ్ర డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపి ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు.
Also Read:Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
కొత్తగా అమలయ్యే వాటాల వివరాలు…
వచ్చే వారం (ఏప్రిల్ 3) నుంచి సినిమాల వసూళ్లలో థియేటర్ వాటా ఇలా ఉంటుంది.. మొదటి వారం.. వసూళ్లలో 60 శాతం, రెండో వారం వసూళ్లలో 50 శాతం, మూడో వారం వసూళ్లలో 40 శాతం. సినిమా ప్రదర్శన కొనసాగాలంటే ఒక షోకి కనీసం ‘హౌస్ ఫుల్ గ్రాస్’ వసూలు కావాలనే నిబంధన కూడా పెట్టారు.
ఎందుకు ఈ మార్పు..?
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అద్దె పద్ధతితో థియేటర్లను నడపడం కష్టంగా మారింది. ఖరీదైన లొకేషన్లలో ఉన్న థియేటర్లలో ప్రేక్షకులకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడానికి భారీగా ఖర్చవుతోంది.

ఇటీవల బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ల సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ శాతాల పద్ధతి అమలవుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడకుండా కాపాడుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు.
రాబోయే రోజుల్లో అందరికీ వర్తింపు..
ప్రస్తుతానికి 23 థియేటర్లు ఈ పద్ధతిని ప్రారంభిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు దశలవారీగా ఇదే విధానంలోకి మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల థియేటర్ యజమానులకు ఊరట లభిస్తుందని.. సినిమా పరిశ్రమ మనుగడకు ఇది మేలు చేస్తుందని చాంబర్ సభ్యులు భావిస్తున్నారు.