
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్‌జిటి నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే పర్యావరణంపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.
గురువారం దీనిపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది. రెండు వైపుల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కార్తీక్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌జిటి నుండి మార్గం సుగమమైనట్లే అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.