Reading Time: 2 minutes
Trump Mocks Macron Brigitte Vietnam Slap Video Nato Iran War

Donald Trump: ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు, యూరప్‌లోని మిత్రదేశాలు అమెరికాతో కలిసి రావడం లేదు. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మక్రాన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్.. అమెరికా నాటో కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం కోసం నాటో ఏర్పడలేదని యూరప్ దేశాలు ట్రంప్‌కు కౌంటర్ ఇస్తున్నాయి.

ఇప్పుడు ట్రంప్ ఈ దేశాధినేతలపై నేరుగా వ్యక్తిగత దాడికి దిగారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ గురించి మాట్లాడుతూ.. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టి మక్రాన్‌లను ఎగతాళి చేశారు. మక్రాన్ ‘‘ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకుంటున్నారని’’ ట్రంప్ అన్నారు. అతడి భార్య అతడితో దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ‘‘నేను మక్రాన్‌కు ఫోన్ చేశా. అతడి భార్య అతడితో దారుణంగా ప్రవర్తిస్తుంది. అతను ఇంకా చెంపదెబ్బ నుంచి కొలుకుంటున్నాడు.’’ అని ట్రంప్ అన్నారు.

వియత్నాం పర్యటనలో బ్రిగెట్టి మక్రాన్‌ను కొట్టిందా?

వియత్నాం పర్యటన సమయంలో విమానం నుంచి దిగుతున్న మక్రాన్‌ను బ్రిగెట్టి ముఖంపై చేయి చేసుకున్నట్లు చూపించే వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 2025 నాడు ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఆరోపణల్ని మక్రాన్ తోసిపుచ్చారు. తన స్కూల్ టీచర్, తన కన్నా పెద్దదైన, వివాహమై అప్పటికే పిల్లలు ఉన్న బ్రిగెట్టిని మక్రాన్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు.