
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (PEDDI). ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే ఇటీవల ఈ చిత్రం వాయిదా పడుతుందనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రొడ్యూసర్ SKN చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం మరింత ఉపందుకున్నాయి. SKN క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అవి మరింత ఎక్కువ అయ్యాయి. అందుకు ముఖ్య కారణం కొంత వర్క్ బ్యాలెన్స్ ఉందని, VFX పనులు ఇంకా పూర్తికాలేదని టాక్ నడుస్తుంది. దీంతో జూలై లేదా ఆగస్ట్‌కు ‘పెద్ది’ రిలీజ్ మార్చవచ్చని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో స్వయంగా హీరో రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. పెద్ది అస్సలు పోస్ట్‌పోన్ కాదంటూ.. ఏప్రిల్ 30నే థియేటర్లలోకి వస్తుందంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన నిర్మించిన ‘రాకాసా’ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా చరణ్ వారితో మాట్లాడారు.
ALSO READ : సహజీవనం చేశా ఆస్తిలో వాటా ఇప్పించండి..
‘రాకాసా’ టీజర్, ట్రైలర్ విజువల్స్‌పై ప్రశంసలు కురిపించిన చరణ్, తన ‘పెద్ది’ సినిమా గురించి స్పష్టంగా స్పందించారు. “పెద్ది సినిమా వాయిదా పడుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌ను నమ్మవద్దు. మా సినిమా అనుకున్న తేదీకే, ఏప్రిల్ 30న విడుదల అవుతుంది. దయచేసి ఈ రూమర్స్‌కు అడ్డుకట్ట వేయండి,” అని రాకాస టీమ్ని చరణ్ కోరాడు. దీంతో ‘పెద్ది’ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలకు పూర్తిగా తెరపడింది. అయితే, ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయా లేదా అన్నది చూడాలి.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్ షాట్ వీడియో, పెహల్వాన్ గ్లింప్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. క్రికెట్, కుస్తీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇటీవలే విడుదలైన రెండో సింగిల్ ‘రై రై రా రా’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాకాస’. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా రేపు ఏప్రిల్ 3న విడుదల కానుంది. కామెడీ, ఫాంటసీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో మూవీ రూపొందింది.