ఎండాకాలం వచ్చింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి నీళ్లు, ఫ్రిజ్ వాటర్ తాగడం.. ఐస్క్రీమ్లు తినడం వంటివి చేస్తారు. అయితే.. ఇలా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా సైనస్ లక్షణాలు వర్షాకాలం, చలికాలంలో కనిపిస్తాయి. అయితే, ఎండాకాలంలో చల్లటి నీళ్లు, ఫ్రిజ్ వాటర్, ఐస్క్రీమ్లు వంటివి అధికంగా తీసుకోవడం వల్ల కూడా సైనస్ సమస్యలు (రోజ్ కోల్డ్) ఏర్పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని అశ్రద్ధ చేస్తే ఆస్తమాగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా దీనివల్ల దీర్ఘకాలిక జలుబు, తలనొప్పి వంటి తాత్కాలిక సమస్యలు ఎదురవుతాయి.
ఫ్రిజ్లో ఉంచిన కూలింగ్ వాటర్ (చల్లటి నీరు) నీరు తరచుగా తాగడం వల్ల జీర్ణక్రియ మందగించడం, గొంతు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. చల్లటి నీరు శరీరంలోని రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేసి, ఆహారం అరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియ (అగ్ని)ని బలహీనపరుస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
కూలింగ్ వాటర్ తాగితే గొంతు నొప్పితోపాటు.. గొంతు బొంగురుపోయే అవకాశం ఉంది.. కూలింగ్ వాటర్ వల్ల జలుబు, దగ్గు కూడా వస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో కూడా మరీ ఎక్కువ చల్లటి నీరు తాగకుండా, కుండలోని నీరు లేదా సాధారణ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా హైడ్రేషన్ గా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.




