Reading Time: 2 minutes

ఒరాకిల్‌లో ఉద్యోగం పోయిందని ఏడుస్తూ కూర్చోవద్దు.. కొత్త ఉత్సాహంతో అడుగులు వేయండి: బెంగళూరు సీఈఓ

Caption of Image.

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కొన్నాళ్లుగా సర్వ సాధారణంగా మారాయి. ఒరాకిల్ ఇండియాలో 12వేల మంది ఉద్యోగులను తొలగించటం దేశంలోని ఐటీ కారిడార్లలో కలకలం రేపింది. అయితే ఉద్యోగం పోయిందనే ఆందోళనలో దిగులుగా ఉన్న టెక్కీలకు ధైర్యం చెబుతూ.. భవిష్యత్తులో కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనే మెసేజ్ బెంగళూరుకు చెందిన ప్రముఖ సీఈఓ ప్రదీప్ సౌందరరాజన్ పంచుకున్నారు. ఆయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన విషయాలు ప్రతి టెక్కీ కచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. లేఆఫ్ కారణంగా జరిగిన నష్టం నుంచి ఎలా ముందుకెళ్లాలో టెక్కీలకు నేర్పిస్తోంది. 

గతాన్ని గౌరవించండి.. భవిష్యత్తు వైపు వెళ్లండి
ఉద్యోగం పోవడం అనేది పర్సనల్ ఫెయిల్యూర్ కాదని.. అది కేవలం కంపెనీ నాయకత్వ మార్పులు, వ్యాపార వ్యూహాల వల్ల జరిగే ప్రక్రియన్నారు ప్రదీప్. అందువల్ల టెక్కీలు పాత కంపెనీలో గడిపిన సమయానికి కృతజ్ఞతగా ఉండాలని సూచించారు. అక్కడ నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోవాలని.. కానీ ఆ ఆలోచనల్లోనే మిగిలిపోకూడదని అన్నారు. ఎమోషనల్ అయ్యి టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. జరిగిన దాన్ని తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగడమే అసలైన గెలుపని గుర్తుచేశారు.

సరికొత్త సీవీకి శ్రీకారం..
సాధారణంగా ఉద్యోగులు జాబ్ సెర్చ్ కోసం తమ పాత సీవీలనే అప్డేట్ చేస్తుంటారు. లేఆఫ్స్ వల్ల జాబ్ పోగొట్టుకున్న టెక్కీలు తమ అనుభవం గురించి 10 పేజీల సెల్ఫ్ రివ్యూ రాసుకోవాలని  ప్రదీప్ చెబుతున్నారు. గత ఉద్యోగంలో మీరు సాధించినవి ఏంటి? ఎక్కడ ఫెయిల్ అయ్యారు? కొత్త జాబ్ వస్తే మీరు చేయబోయే మార్పులేంటి? అనే అంశాలను అక్కడ రాయాలన్నారు. ఇంటర్వ్యూ సమయంలో కేవలం రెజ్యూమ్ మాత్రమే కాకుండా.. ఇలాంటి వివరాలు పంచుకోవటం వల్ల మీ పట్ల కంపెనీలకు నమ్మకం పెరుగుతుందని చెప్పారు. 

చిన్న కంపెనీలే పెద్ద అవకాశాలు..
పెద్ద పెద్ద కంపెనీల్లో సిస్టమ్స్ నెమ్మదిగా ఉంటాయని, అందుకే అక్కడ వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రదీప్. ప్రస్తుతం మీకున్న స్కిల్స్ గుర్తించే చిన్న మధ్య తరహా కంపెనీలు, స్టార్టప్స్ వైపు వెళ్లటం బెటర్ అన్నారు. అక్కడ మంచి హోదా, శాలరీతో పాటు ఈక్విటీలు పొందే అవకాశం కూడా ఉంటుందని సూచించారు. అలాగే డెవలపర్లు, టెస్టింగ్ టీమ్స్, సేల్స్ టీమ్ వారు మిగిలిన పనులు నేర్చుకుంటూ మల్టీ-టాలెంటెడ్ గా మారొచ్చని చెప్పారు. 

పాత కష్టాలే కొత్త విజయాలు.. 
ప్రదీప్ తన పర్సనల్ మెమెురీస్ పంచుకుంటూ.. తాను కూడా ఒకప్పుడు ఉద్యోగం పోయినప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్లడానికి డబ్బులు లేక అప్పులు చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అవే కష్టాలు తనను ప్రస్తుతం ఒక కంపెనీకి సీఈఓగా నిలబెట్టాయని చెబుతూ.. మార్కెట్ పరిస్థితులు మారవచ్చు కానీ అవకాశాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికే అని అధైర్య పడొద్దంటూ సోషల్ మీడియాలో టెక్కీలకు బూస్టప్ ఇచ్చారు బెంగళూరు కంపెనీ సీఈఓ ప్రదీప్. 

©️ VIL Media Pvt Ltd.