
Arjun Tendulkar Batting Idol: సాధారణంగా ఏ క్రికెటర్ కొడుకైనా తన తండ్రినే ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ అర్జున్ టెండూల్కర్ మాత్రం భిన్నమైన సమాధానం ఇచ్చాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ను పక్కన పెడితే, ఆటలో తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి యువరాజ్ సింగ్ అని అర్జున్ స్పష్టం చేశాడు. యూవీ బ్యాటింగ్ స్టైల్, అతని ఆల్ రౌండ్ ప్రదర్శన అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. కేవలం ఇష్టపడటమే కాకుండా, తన బ్యాట్ లిఫ్ట్, గ్రిప్‌ను మెరుగుపరుచుకోవడానికి యువరాజ్ సలహాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు.
గాయాల సవాలు, పునరాగమనం..
లెజెండరీ క్రికెటర్ వారసుడిగా ఉండటం ఒక వరమైతే, అదే సమయంలో అది పెద్ద సవాలు కూడా. నిరంతరం తన తండ్రితో పోల్చడంపై స్పందిస్తూ, తాను ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని, కేవలం క్రికెట్ పట్ల ఉన్న ప్యాషన్‌తోనే ఆడుతున్నానని అర్జున్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న రెండు వరుస స్ట్రెస్ ఫ్రాక్చర్స్ గురించి వివరిస్తూ, ఆ సమయంలో తన బౌలింగ్ యాక్షన్ మొత్తాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని, దానివల్ల ఒక కీలకమైన అండర్-19 సంవత్సరం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో కొత్త ప్రయాణం..
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడుతున్న అర్జున్, కొత్త జట్టు, కొత్త నగరం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. లక్నో సంస్కృతి, అక్కడి ‘తహజీబ్’ (మర్యాద) ముఖ్యంగా అక్కడి బిర్యానీ, కబాబ్‌లు తనకు ఎంతో నచ్చాయని తెలిపాడు. భరత్ అరుణ్ వంటి దిగ్గజ కోచ్‌ల పర్యవేక్షణలో తన ట్యాక్టిక్స్‌ను మెరుగుపరుచుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై అసహనం..
ప్రస్తుత ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై అర్జున్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. సంప్రదాయబద్ధంగా క్రికెట్ అంటే 11 మంది ఆడే ఆట అని, ఈ కొత్త రూల్ వల్ల బౌలర్లకు నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డాడు. అదనపు బ్యాటర్ ఉండటం వల్ల జట్లు భారీ స్కోర్లు చేస్తున్నాయని, ఇది ఆటను డల్ చేస్తున్నట్లు తాను భావిస్తున్నానని అర్జున్ పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..