Reading Time: < 1 minute

తెలంగాణ రవాణా శాఖ రికార్డ్ ..ఏడాదిలో రూ.7097 కోట్ల ఆదాయం

Caption of Image.

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ  ఆదాయం భారీగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రవాణా శాఖ తాజాగా కీలక వివరాలు వెల్లడించింది . పలు  రకాల పన్నులు, సేవల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది.

రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం..  జీవిత కాలపు పన్నుల ద్వారా అత్యధికంగా రూ. 4,714 కోట్లు లభించగా..    త్రైమాసిక పన్నుల ద్వారా 961 కోట్లు,  పర్యావరణ పరిరక్షణలో భాగంగా వసూలు చేసే గ్రీన్ టాక్స్ ద్వారా రూ. 78.35 కోట్లు సమకూరాయి. ఇవే కాకుండా, ఫీజులు, సర్వీస్ ఛార్జీల రూపంలో  రూ.820 కోట్లు,  అధికారుల తనిఖీల ద్వారా 212.49 కోట్లు, పలు  రకాల చలాన్ల ద్వారా మరో రూ. 310.80 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరింది.

2025-26 వార్షిక సంవత్సరానికి గాను ఏప్రిల్  1నుంచి డిసెంబర్ వరకు రూ. 8,535 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. 2026 (మార్చి31) ఇప్పటివరకు రూ.7,097.38 కోట్లను సాధించినట్లు రవాణా శాఖ ప్రకటించింది. అంటే నిర్దేశించుకున్న లక్ష్యంలో 83.16 శాతం పురోగతి సాధించడం విశేషం. గత ఏడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 2.70 శాతం వృద్ధి రేటు నమోదైందని  తెలిపింది. 

2025-26 సంవత్సరంలో ఇప్పటివరకు 91,637 ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతో పాటు.. ఆ వాహనదారులకు సుమారు 769.81 కోట్ల రూపాయల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి పన్నుల వసూళ్లలో పారదర్శకత, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా రవాణా శాఖ ఆశించిన ఫలితాలను సాధిస్తోంది.
 

©️ VIL Media Pvt Ltd.