
డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్‌కర్నూల్ ఎంపి మల్లు రవి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపి మల్లు రవి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమని, రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి నుంచి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో పాదయాత్ర చేస్తానని ఆయన తెలియజేశారు.
రైల్వే లైన్‌ను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నుట్లు ప్రకటించారు. మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేశానని, సిఎం ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల రైల్వే మంత్రిని కలిసి డోర్నకల్ నుంచి -గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశానని, ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించినట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లోని కల్వకుర్తికి వచ్చి తరువాత వనపర్తి జిల్లా నుంచి గద్వాల్‌కి కనెక్ట్ అవుతుందని వివరించారు. జనరల్ రాయల్ ప్లాన్ కింద లైన్ నిర్ణయం తీసుకుంటే రెవెన్యూ రిటరన్స్ లేవనే ఇబ్బందులు తలెత్తుతాయని,
దీన్ని బ్యాక్‌వర్డ్ ఏరియా డెవలప్‌మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరామని, ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని చెప్పారు. ఈ లైన్‌ను కూడా త్వరలో మంజూరు చేసి, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ రెండు లైన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారని, రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.