Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అర్ధరాత్రి సమయంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పాల్గొంటున్న ఈ న్యాయాధికారులు, ముగ్గురు మహిళలు సహా, బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాలియాచక్- 2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఉండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని ఘెరావ్ చేశారు.

ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు కోల్‌కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కోరిన నిరసనకారులు, అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు.

న్యాయాధికారులను తీసుకెళ్తున్న వాహనాలను ఆపడానికి, వాటిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారు. సురక్షితంగా వారిని తరలించేందుకు మా సిబ్బంది స్వల్ప బల ప్రయోగం చేయాల్సి వచ్చింది, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులు వాహనాలు ఢీకొనడంతో గాయపడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 28న విడుదలైన ఓటరు జాబితాల్లో ‘పరిశీలన’గా గుర్తించిన పేర్లపై న్యాయాధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లు కొనసాగించాలా లేదా తొలగించాలా అన్నది వారు నిర్ణయిస్తున్నారు.