Reading Time: < 1 minute

 రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే పాత కారు అంటూ ఇచ్చిన సూపర్ బంపర్ ఆఫర్ చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం చేసిన ఈ ఆఫర్‌ను నమ్మి హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి వందలాది జనం నాచారం, మల్లాపూర్‌లోని ట్రస్ట్ కార్స్ కార్యాలయాలకు రెండు రోజులుగా తరలివచ్చారు. ఒక దశలో రాత్రి వచ్చి ఇక్కడే నిద్రకు ఉపక్రమించారు. మరీ క్యూలో గంటల తరబడి వెయిట్ చేశారు. కానీ, ప్రచారంలో చెప్పినట్టుగా కార్లు ఇవ్వకపోవడం, కార్లు లేవని మోసానికి పాల్పడటంతో కొనుగోలుదారులు ఆగ్రహానికి గురయ్యారు. తమను మోసం చేశారంటూ ట్రస్ట్ కార్స్ కార్యాలయాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో కొన్ని కార్లు, కార్యాలయాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో ఆఫర్ పేరుతో ప్రజలను ఆకర్షించి, స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా గందరగోళం సృష్టించినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ట్రస్ట్ కార్స్ ఎండీని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తక్కువ ధరకు కారు అనే ఆశతో వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా ప్రకటనలపై నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.