Reading Time: < 1 minute

మన తెలంగాణ / హైదారాబాద్ : మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదివారం నుండి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు నడువనున్నాయి. మేడారంలో ఆర్‌టిసి తాత్కాలిక బస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నందున ఆర్‌టిసి జిహెచ్‌ఎంసి పరిధిలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులను ఆదివారం ప్రారంభించింది. జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4 వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్‌టిసి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా వెంటనే పెంచే విధంగా సంస్థ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేడారం జాతరకు 3491 ఆర్‌టిసి బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేస్తారనే అంచనాతో 4 వేల బస్సులను నడిపేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది. ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా ఆర్‌టిసి ఉన్నతాధికారులు జాతర విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్‌టిసి బస్సులనే వినియోగించాలని సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని, ఆర్‌టిసి బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని అధికారులు తెలిపారు. ఆర్‌టిసి ప్రయాణం భద్రతాపరంగా మరింత నమ్మదగిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ఆర్‌టిసి బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ సారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా మేడారం వెళ్ళే రూట్లలో వరంగల్ ,హనుమకొండ , ఖమ్మం,కరీంనగర్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండనుండడంతో రద్దీగా తగిన విధంగా బస్సులు నడపడానికి అక్కడ అధికారులు సిద్ధంగా ఉండేలా ఆర్‌టిసి ఏర్పాట్లు చేసింది.