Reading Time: 2 minutes

 తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని తమిళగ వెట్రి కజగం (టివికె) నాయకుడు, సినిమా హీరో విజయ్ చెప్పారు. ఇవి కేవలం ఎన్నికల పోరే కాకుండా తీవ్రస్ధాయిలో జరిగే ప్రజాస్వామ్య యుద్ధం అని విశ్లేషించారు. తమిళనాడులోని ప్రఖ్యాత మహాబలిపురంలో ఆదివారం ఆయన తమ పార్టీ గుర్తు విజిల్ చప్పుళ్లతో భారీ సభ నిర్వహించారు. తాము ఎవరికి భయపడేది లేదని, విజయం సొంతంగా తమ పార్టీదే అవుతుందని తేల్చిచెప్పారు. ఇంతకాలం రాజకీయాధికారం చెలాయించిన శక్తులకు సమర్థవంతమైన సవాలును విసిరే స్థితిలో తాము ఉన్నామని విజయ్ చెప్పారు. ఈ సభ నుంచే ఆయన తమ పార్టీ ఎన్నికల గుర్తును ఆవిష్కరించారు. ఇంతకాలం సాగిన అవినీతి పాలనను అంతమొందించే ధైర్యం తమ పార్టీకే ఉందని చెప్పారు. అన్నాడిఎంకె బిజెపికి బహిరంగంగా సరెండర్ అయింది.

పలు కారణాలతో అధికార డిఎంకె లోపాయికారిగా కాషాయ పార్టీతో కుమ్మక్కు అయింది. ఈ విషయాన్ని తమళులు గుర్తించారు. ఈ దశలో అరాచకాన్ని ఎదిరించే సైన్యం , నిజాయితీతో పనిచేయగలిగే కమాండర్ల బలం టివికెకు ఉందని, సరికొత్తగా స్వచ్ఛమైన రీతిలో ముందుకు వస్తున్న తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఓ దుష్టశక్తి అధికారంలో ఉంది. మరో వైపు రాష్ట్రాన్ని దోచుకుని తిన్న అవినీతి బలగం తిరిగి అవకాశం కోసం ఎదురుచూస్తోందని డిఎంకె, అన్నాడిఎంకెలపై విరుచుకుపడ్డారు. ఈ రెండూ శక్తులు తమిళనాడుకు సవ్యమైన పాలన అందించలేవు. ఈ రెండింటిని ధైర్యంతో ఎదిరించి విజయం సాధిస్తామని తెలిపారు. తాను సినిమా వదిలి రాజకీయాల్లో ప్రవేశించింది తన కోసం కాదని, హానీ కల్గించే వారి నుంచి ఈ తమిళనేలను రక్షించేందుకే అన్నారు..అత్యున్నత రాజకీయ సమగ్రతా విలువలతో , కుటుంబంలో ఓ సభ్యుడిగా నిలిచే అవకాశం తనకు దక్కిందన్నారు.

ఇతర పార్టీల మాదిరిగా అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదనేది ప్రజల నమ్మకం. ఇదే తన బలం , రాబోయే విజయానికి మూలం అన్నారు. ప్రజల నమ్మకాన్ని తాను నిలబెట్టి తీరుతానని, పనుల కోసం ఒక్క పైసా తీసుకోబోనని, ఒక్క అవినీతి చుక్క మరక కూడా పార్టీపై పడనివ్వబోమని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయ పార్టీలకు సరెండర్ అవుతానని, రాజకీయ ఒత్తిళ్లతో లొంగిపోతాననే వాదన పనికిరానిదని కొట్టిపారేశారు. ఈ ఎన్నికలలో తమిళనాడులో రాజకీయ అధికారం కైవసం చేసుకుని తీరుతామని ఈ సభ నుంచి విజయ్ తన కేడర్‌తో పాటు ప్రతిన తీసుకున్నారు.