
ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసే క్రమంలో మహిళకు మంటలు అంటుకున్న సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సుద్దపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రియుడిపై కోపంతో అతని కుటుంబసభ్యులపై పెట్రోలు పోసి నిప్పంటించింది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దపల్లికి చెందిన మల్లేష్ కు తెనాలికి చెందిన దుర్గ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెనాలిలో పంచాయతీ పెట్టగా కోపంతో ఉన్న దుర్గ సుద్దపల్లి వెళ్లి మల్లేష్ భార్యతో గొడవ పడింది. ఆ తర్వాత తెనాలి లో ఉన్న మల్లేష్ కి ఫోన్ చేసి భార్య, కొడుకు, మల్లేష్ తల్లిపై పోట్రోలు పోసి నిప్పంటించింది. పెట్రోలు పోసే క్రమంలో దుర్గపై పెట్రోలు పడడంతో ఆమెకు నిప్పంటుకుంది. వెంటనే స్థానికులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో ఆరుగురు స్థానికులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన దుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.