Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ‘సిట్’ అధికారులను బెదిరిస్తున్న బిఆర్‌ఎస్ నేతలపై రౌడీ షీట్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర డిజిపిని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నేతలపై జాలి చూపరాదని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటూ అధికారులను బె దిరించడం ఏమి పద్ధతి అని ఆయన ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కెటిఆర్ వెళుతున్నప్పుడు స్వాతంత్య్ర ఉద్యమకారునిలా బిల్డప్ ఇచ్చారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ఏమిటో వెలుగు చూస్తాయని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అబద్దపు పునాదులపై పార్టీని నడిపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచితనం వల్లే బిఆర్‌ఎస్ నేతల ఆటలు సాగుతున్నాయన్నారు.