
అమెరికాలో దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయి మంచు తుపాన్ సంభవించింది. ఈస్ట్‌కోస్ట్‌లో ఇంతకు ముందెన్నడూ మంచు వర్షం, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు లేని రాష్ట్రాలపై కూడా ఇప్పుడు ప్రభావం పడింది. ఆదివారం సోమవారం భారీ స్థాయిలో మంతుతుపాన్ ప్రభావం పడనుంది. దీనితో మొత్తం మీద దేశవ్యాప్తంగా 9000కు పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఈ పరిణామంతో అమెరికా అంతటా దాదాపుగా ఆదివారం , సోమవారం విమానాల సర్వీసులు ఉండవు. పలు ప్రాంతాలలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 34 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరింది. గ్రామీణ లూయిస్ కౌంటీలో ఈ పరిణామం చాలా రోజులుగా నెలకొంది. అనేక చోట్ల ఓ అడుగు లేదా 30 సెంటిమీటర్ల ఎత్తు మంచు పేరుకుపోయింది. దీనిని తొలిగించడం అతి కష్టం అవుతోంది. ఓ వైపు ట్రంప్ ఇది ఏమంత పెద్ద సమస్య కాదని కొట్టిపారేస్తూ ఉన్నా, గ్లోబల్ వార్మింగ్ కామెంట్లకు దిగుతూ ఉన్నా ఇప్పటి పరిణామం అమెరికాకు బారీ మంచు ఉపద్రవంగా మారింది.
దాదాపు 40 రాష్ట్రాలు అత్యల్ప ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది వరకూ ఇళ్లలో నుంచి కదలలేని స్థితిలో చిక్కారు. పలు చోట్ల రవాణా వ్యవస్థ కుంటుపడింది. పరిస్థితిని గుర్తించి ఇప్పుడు పలు రాష్ట్రాలలో సూపర్‌మార్కెట్లకు జనం ఎగబడి సరుకులు కొనుక్కుని వెళ్లుతున్నారు. దీనితో ఇవి దాదాపుగా ఖాళీ అయ్యాయి. ఇంతకు ముందు లేని రీతిలో ఇప్పుడు అసాధారణంగా టెక్సాస్ , ఒక్లాహామా వంటి రాష్ట్రాలపై మంచు తుపాన్ పంజా విసిరింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలి, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, బ్లాకౌట్ పరిస్థితి , వాహనాలు నిలువెత్తు మంచులో కూరుకుని పోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. బారీ వర్షం, మంచు కురియడంతో పరిస్థితి దిగజారింది. గురువారం శుక్రవారం రాత్రి అంతా మంచుతుపాన్ తాకిడి ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి. మంచుతుపాన్‌తో ఉపద్రవ స్థాయిలో పలు చోట్ల భారీ స్థాయిలో మంచు పడుతుందని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. చెట్లు భారీ సంఖ్యలో కూలిపోవచ్చు. అత్యంత అవసరం అయితే తప్పితే ప్రయాణాలకు దిగరాదు.
దాదాపుగా వాహనాలు నడిచే పరిస్థితి లేదని అధికారికంగా ప్రకటించారు. దేశ సెంట్రల్ , ఆగ్నేయ ప్రాంతాలపై విరుచుకుపడ్డ మంచుతుపాన్ ఇప్పుడు అత్యంత జనసమ్మర్థపు మధ్య అట్లాంటిక్ , ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా సాగుతుంది. దీనితో న్యూ మెక్సికో నుంచి ఈస్టర్న్ సీ బోర్డు ప్రాంతం వరకూ ప్రభావం పడుతుందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వారాంతంలో 2700 విమానాలు రద్దు అయ్యాయి. తిరిగి ప్రకటించే వరకూ దేశీయ మార్గాలలో విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. పైగా ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు ఎవరూ బయటకు గరాకూడదని గవర్నర్ కెథీ హోచుల్ తెలిపారు. ఐదారు నిమిషాలు బయట తిరిగినా అది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ లేడీ గవర్నర్ సూచించారు. న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీకి ఇప్పుడు ఈ వైపరీత్యం పెద్ద సవాలుగా మారింది. చికాగో ఇతర ప్రాంతాల్లో పరిస్థితి గడ్డకట్టుకు పోయే విధంగా మారింది.