Reading Time: < 1 minute

చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఆలపించిన ’వెళ్లేదారిలో’ అనే బ్యూటిఫుల్ పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. కాగా ఈ పాట సక్సెస్ సెలబ్రేషన్స్‌తో పాటు చిత్ర విడుదల తేది ప్రకటన ప్రెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా థ్రియేట్రికల్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అథిగా విచ్చేసిన ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ “యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా మంది యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ప్రేరణనిచ్చే కథ ఇది”అని పేర్కొన్నారు. నిర్మాత గోపాలకృష్ఱ మాట్లాడుతూ “కొత్తవాళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఐదో సినిమా ఇది. ఓ పెద్ద సినిమాకు తీసిపోని ఈ సినిమాను వంశీ నందిపాటి తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు”అని అన్నారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి సాంగ్ అందరి హృదయాలకు హత్తుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో వంశీ తుమ్మల, హీరోయిన్ సంద్యా వశిష్ట, సంగీత దర్శకుడు చందు రవి తదితరులు పాల్గొన్నారు.