
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. స్పోర్ట్ డ్రామా జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్ డ్రామాలో డైరెక్టర్ బుచ్చిబాబు ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ఇప్పటివరకు పలువురు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
కానీ చివరకు ఈ ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగు ప్రేక్షకుల్లో మృణాల్ ఠాకూర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె గ్లామర్‌తో పాటు నటనలో ఉన్న పాపులారిటీ దృష్ట్యా, ‘పెద్ది’లో ఈ స్పెషల్ సాంగ్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో మృణాల్‌కు మంచి పాపులారిటీ ఉంది. త్వరలోనే ‘పెద్ది’ ఐటమ్ భామపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.