
గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్ పై వెళుతున్న యువకుడు బావిలో పడిపోయిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. రాయ్ బరేలికి చెందిన రితేశ్ జైస్వాల్ లఖ్నోలోని అర్జున్ గంజ్ లో నివాసముంటున్నాడు. అయితే రితేశ్ తన సొంత ఊరికి బైక్ వెళ్లే సమయంలో కరోరా-నాగ్రామ్ దారిలో గూగుల్ మ్యాప్ ను చూస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ చోట పెద్ద మలుపు రావడంతో ముందుకు వెళ్లగా బావి గోడను ఢీకొట్టాడు. దీంతో రితేశ్ బైక్ పై నుంచి బావిలో పడిపోయాడు. అదే దారిలో గస్తీలో ఉన్న పోలీసులు రోడ్డు పక్కన బైక్ పడిపోయి ఉండటాన్ని గమనించి బావి వద్దకు వెళ్ళి చూడగా బావిలో రితేశ్ అరుపులు వినిపించాయి. వెంటనే రితేశ్ ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో రితేశ్ స్వల్పంగా గాయపడ్డాడు.