
న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మార్క్ చాప్‌మన్ (39), డారిల్ మిఛెల్ (28), కెప్టెన్ సాంట్నర్ (20) పరుగులు చేశారు.
అభిషేక్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (8) కూడా నిరాశ పరిచాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ జోరును కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
సూర్యకుమార్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన సూర్యకుమార్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 35 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 16 బంతుల్లోనే 25 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు చివర్లో రింకు సింగ్ వీరవిహారం చేశాడు. కివీస్ బౌలర్లపై విరుచుకు పడిన రింకు 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు.