
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డేలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ జాబితా ప్రకటించింది. ఇటీవల భారత్‌తో జరిగిన రెండో, మూడో వన్డేలలో మిచెల్ వరుస సెంచరీలతో రాణించాడు.ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ, ర్యాంకింగ్స్‌లో మిచెల్ అతన్ని అధిగమించాడు. కోహ్లీపై మిచెల్ 50 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించి నంబర్ స్థానానికి చేరుకున్నాడు.
ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 795 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, న్యూజిలాండ్ సిరీస్ కు ముందు నంబర్ వన్ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతో ర్యాకింగ్స్ జాబితాలో 757 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్(670 రేటింగ్ పాయింట్లు) టాప్ 10లోకి దూసుకెళ్లాడు.
కాగా, టీమిండియాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్టే సిరీస్ ను 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. రేపటి నుంచి ఇరుజట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.