
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి ఎన్ని సిట్ నోటీసులు పంపినా భయపడేది లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తే ల్చిచెప్పారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎన్ని సిట్లు వేసి నా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో హరీష్ రావును ప్రత్యేక దర్యా ప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం విచారించారు.అనంతరం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణ అంతా సొల్లు అని, అన్నీ నిరాధారమైన ఆరోపణలేనని అన్నారు. ఇది లీకుల ప్రభుత్వం అని, విచారణపై కూడా ఏదో ఒక లీక్ ఇస్తారని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ అంతా రికార్డు చేశారు కదా..దమ్ముంటే ఆ వీడియోను బయటపెట్టాలని సవాల్ విరిసారు.
విచారణను కూడా ప్రజలంతా చూస్తారని అన్నారు. తనను విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని అధికారులు బయటకు వెళ్లడం చేశారు. విచారణ మధ్యలో గంట గంటకు అధికారులకు ఫోన్లు వచ్చాయని, వారికి ఫోన్లు రాగానే అధికారులు ప్రశ్నలు అడిగారని చెప్పారు. సిఎం రేవంత్‌రెడ్డి ఫోన్లు చేశారో..సిపి సజ్జనార్ ఫోన్లు చేశారో తెలియదని అన్నారు. అరెస్టులు తమకు కొత్తేమీ కాదని అన్నారు. ముగ్గురు అధికారులతో కూడిన సిట్ దర్యాప్తు బృందం తనను ప్రశ్నించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయతీపరుడైతే సింగరేణి టెండర్ల అంశంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికిపందలా పోలీసులను వెనుకబెట్టుకుని కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.సిట్ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల కుంభకోణాలు, చీకటి రాజకీయాలను బయటపెడుతున్నామని తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సిఎం, మంత్రుల దోపిడీలను ప్రశ్నిస్తున్నామని, తమపై కేసులు పెడతారా..? అని నిలదీశారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిలా తమకు వెన్నుపోట్లు తెలియవని, పోరాటాలు మాత్రమే తెలుసు అని పేర్కొన్నారు.కెసిఆర్ తమకు నేర్పింది పోరాటమే అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తనకు సిట్ ద్వారా వచ్చిన నోటీసులు రేవంత్‌రెడ్డి పతనానికి నాంది అని చెప్పారు. వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు విస్మరించారని ఆరోపించారు. ధైర్యం ఉంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. చిల్లర, బురద, కుట్ర, కుతంత్రాల రాజకీయాలు ఇక నడవవని అన్నారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చిందని, ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి భాష వింటే రోత పుడుతోందని అన్నారు. నోటీసులు, విచారణలు బిఆర్‌ఎస్‌ను భయపెట్టలేవని చెప్పారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు.
నేనే సిట్ అధికారులకు వంద ప్రశ్నలు వేశాను : హరీష్‌రావు చిట్‌చాట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనను ప్రశ్నించడం కాదని, తానే సిట్ అధికారులకు వంద ప్రశ్నలు వేశానని హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం ఏమిటని అధికారులను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. తాను హోంమంత్రిగా ఎప్పుడైనా పని చేశానా..? అని అడిగానని వ్యాఖ్యానించారు. నాటి డిజిపి మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిని కూడా విచారణకు పిలవాలని అధికారులకు చెప్పానని అన్నారు.
ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు
ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు చెంపచెల్లు మనేలా సమాధానం చెప్పిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆయనను వదిలి పెట్టేదని లేదని తేల్చిచెప్పారు. కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటామని వెల్లడించారు. తాము కెసిఆర్ నాయకత్వంలో రాటు దేలిన కార్యకర్తలం…ఉద్యమకారులం అని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలి పెట్టం అని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతారని నిలదీశారు. చిల్లర రాజకీయాలు బంద్ పెట్టాలని అన్నారు. ప్రజలకు కావాల్సింది రైతు బందు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారం అని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తనమీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేరని, ఇంకా గట్టిగా నిలదీస్తామని తేల్చిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు సక్సెస్ కావు అని, రేవంత్‌రెడ్డి కేసులకు బిఆర్‌ఎస్ బయపడదని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ప్రజలకు దిమ్మదిరిగే విధంగా జవాబు చెబుతారని చెప్పారు. ఆయన ఏం నేర్చుకుంటారో చూడాలని ఎద్దేవా చేశారు. జనవరి 31 తర్వాత రేవంత్‌రెడ్డిలో కొత్త మనిషి.. కొత్త భాష వస్తుందేమో చూద్దామని కెటిఆర్ అన్నారు.