
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఎన్‌ఐటిల్లో బి.టెక్, బి.ఆర్క్ సీట్ల భర్తీకి, జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేందుకు ఈనెల 21 నుంచి జెఇఇ మెయిన్ సెషన్ 2026 పరీక్ష ప్రారంభం కానుంది. ఈనెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఈనెల 29న పేపర్-2 జరుగుతుంది. రోజూ ఉదయం 9- నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి -6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు తెలిసింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలంగాణలో మూడు పరీక్ష కేంద్రాలను పెంచింది. తెలంగాణలో గత ఏడాది వరకు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈసారి ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి కొత్తగా చేరాయి. ఎపి, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరుకానున్నారని అంచనా. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదివి, అందులో పొందుపరిచిన అన్ని నిబంధనలు పాటించాలి.
పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. అలాగే పాస్‌పోర్టు సైజ్ ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం మరిచిపోవద్దు. విద్యార్థులు దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌లో అతికించాల్సి ఉంటుంది. పెద్ద బటన్లు ఉండే చొక్కాలు ధరించి వస్తే అనుమతించరు. అలాగే చిరుతిళ్ళు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం.