Reading Time: < 1 minute

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు పెరోల్ మంజూరు చేస్తే తప్పించుకుని పారిపోతాడని, దాంతో భారత్‌పోర్చుగల్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు మంగళవారం వెల్లడించింది. ముంబై పేలుళ్ల సంఘటన (1993)లో కీలక పాత్రధారి అయిన అబూసలేం తన సోదరుడి మరణం నేపథ్యంలో 14 రోజుల పెరోల్ కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈమేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పెరోల్ ఇవ్వడంతో 1993లోపోర్చుగల్‌కు పారిపోయాడని, ఇప్పుడూ అలా చేస్తాడని అఫిడవిట్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ సుహాస్ వార్కే పేర్కొన్నారు. అదే జరిగితే భారత్‌పోర్చుగల్ దేశాల మధ్య తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని, ఫలితంగా సామాజిక భద్రతకే బెదిరింపు తప్పదన్నారు. 2005లో పోర్చుగల్ నుంచి బహిష్కరించబడ్డాడు. 14 రోజులకు బదులు అవసరం అయితే రెండు రోజుల పెరోల్ ఇవ్వవచ్చని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సిబిఐ కూడా జోక్యం చేసుకుని శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పేర్కొంది. దాంతో కోర్టు ఈ విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది.