
వీధికుక్కల నిషేధం విషయంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రమాజీ మంత్రి మేనకా గాంధీ విమర్శించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని హెచ్చరించింది. అయితే అభియోగాలు మోపకుండా ఆపివేసింది. మేనకాగాంధీ ఇటీవల పాడ్ కాస్ట్ పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జంతు ప్రేమికురాలు అయిన ఆమె ఆలోచించకుండానే అన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె బాడీ ల్యాంగ్వేజ్ ను కూడా కోర్టు తప్పు పట్టింది. వీధి కుక్కల విషయంలో ఇంతగా మాట్లాడిన మేనకా గాంధీ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఏమేరకు బడ్జెట్ కేటాయింపజేశారని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్ వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె గతంలో స్త్రీ, శిశు అభివృద్ధి, సామాజిక న్యాయం, జంతు సంక్షేమ మంత్రిత్వ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.ఈ కేసులో మేనకా గాంధీ తరుపున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ హాజరై వాదనలు వినిపింంచారు. వ్యాఖ్యలు చేసేటప్పుడు కోర్టు జాగ్రత్తగా ఉండాలని ఒక సందర్భంలో న్యాయవాది పేర్కొనగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
మీరు మీ క్లయింట్ ను ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేశారని అడిగారా, మీరు ఆమె పాడ్ కాస్ట్ విన్నారా. అమె అందరికీ వ్యతిరేకంగా అన్నిరకాల వ్యాఖ్యలు చేశారు. మీరు ఆమె బాడీలాంగ్వేజ్ చూశారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం మేనకా గాంధీ కేసులో వాదిస్తున్న రాజు రామచంద్రన్ గతంలో ముంబై టెర్రరిస్ట్ దాడి కేసులో సజీవంగా పట్టుబడిన పాక్ టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ తరుపున తాను వాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కేసులో కసబ్ కు తర్వాత ఉరిశిక్ష పడింది. రాజు రామచంద్రన్ వ్యాఖ్యలకు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆ కేసులో అజ్మల్ కసబ్ ఎలాంటి కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని, ఈ కేసులో మేనకా గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని జస్టిస్ విక్రమ్ నాథ్ గుర్తు చేశారు. అయినా, కోర్టు మేనకా గాంధీ విషయంలో ఔదార్యం చూపి కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించలేదని కోర్టు పేర్కొంది. మేనకా గాంధీ చేసిన ఏ వ్యాఖ్యలు ధిక్కారంగా పరిగణించబడ్డాయో ధర్మాసనం పేర్కొనలేదు. ఆమె మాత్రం నిరుడు కుక్కల విషయంలో కోర్టు ఆదేశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మేనకా గాంధీ ఏమన్నారు?
గత సంవత్సరం వీధికుక్కల బెడద, కుక్కలు కరవడంతో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీలోని పౌర అధికారులకు తీవ్రమైన ఆదేశాలు జారీ చేశారు. 8 వారాలలోగా వీధికుక్కలు అన్నింటినీ, షెల్టర్ లకు తరలించాలని ఆదేశించారు. ఈ ఆదేశంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ అయింది. దీంతో ధర్మాసనం గతంలో ఉత్తర్వులను సవరించి, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల లో తిరుగుతున్న వీధికుక్కలనే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది.జంతు ప్రేమికు రాలు అయిన మేనకా గాంధీ ఈ తీర్పుపై తీవ్రంగా స్పందిస్తూ అది ఆచరణ సాధ్యం కాదని అన్నారు. జస్టిస్ పార్దివాలా తీర్పు చాలా ఘోరమైనదన్నారు. 5 వేల కుక్కలను తొలగిస్తే, వాటి కోసం 50 షెల్టర్లు అవసరం, అన్ని షెల్టర్లు లేవు. వాటిని పట్టుకునే అంతమంది సిబ్బంది లేరు. మహానగరంలో 8 లక్షల కుక్కలు ఉంటే 5 వేల కుక్కలను తొలగిస్తే ఏం మారుతుంది అని మేనకాగాందీ ప్రశ్నించారు.