
అమరావతి: దావోస్ ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుంటున్నానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో మార్పులను తెలుసుకుని పాలసీలు రూపొందిస్తానని అన్నారు. దావోస్ పర్యటనలో వివిధ దేశాల ప్రతినిధులతో సిఎం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమ్మోనియా, గూగూల్ పెట్టుబడులుపై సిఎం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుస్తున్నామని, నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుంది.. సంపద సృష్టి జరుగుతుందని తెలియజేశారు. భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీలో ముందుంటారని, టెక్నాలజీ సమర్థ వినియోగంతో అద్భుత ఫలితాల సాధనకు అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశానికి నేడు తిరుగులేని సమర్థ నాయకత్వం ఉందని, పెట్టుబడులకు భారతదేశం, ఎవి అత్యుత్తమ గమ్యస్థానాలని, 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని జోస్యం చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ గ్రోత్ స్టోరీని చూస్తారని, గతంలో పారిశ్రామికవేత్తలను ఎపికి తేవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుత తెలుగు ప్రజల విక్రయాలు, ఎపి బ్రాండ్ సానుకూల అంశంగా మారాయని, ప్రతి రంగంలో నిర్దిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి.. ఎపికి రావాలని.. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది..ప్రోత్సహిస్తుందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తితో కొత్త చరిత్రకు నాంది పలికామని, వ్యవసాయంతో పాటు వైద్య రంగంలో డ్రోన్లను ఉపయోగించబోతున్నామని అన్నారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఎపిలో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఎపికి వచ్చాయని చెప్పారు. వెయ్యి కి.మి.కు పైగా సముద్రతీరం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఎపికి ఉన్న బలం అని..వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎపి పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా చూడండని, తన విధానాలను పరీక్షించాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎపికి మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు.. ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద మార్కెట్ అవుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.