Reading Time: < 1 minute

పలువురు మహిళలతో ఆఫీస్ లోనే రాసలీలలు జరిపిన డిజిపి ర్యాంకు అధికారిపై వేటు పడింది. కర్నాటకలో సీనియర్ పోలీసు ఆఫీసర్ రామచంద్రరావు రాసలీలల్లో మునిగి తేలుతున్న వీడియోలు వైరల్ కావడం సంచలనం రేకిత్తిస్తోంది. మహిళలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అధికారిక చాంబర్‌లో యూనిఫాంలో ఉండగానే తన సీటులో కూర్చొని మహిళను హత్తుకోవడం, ముద్దులు పెట్టడం ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.

డిజిపి కార్యాలయంలోనే రహస్యంగా వీటిని చిత్రీకరించినట్లు ఆ వీడియోలను బట్టి చూస్తే స్పష్టమవుతోంది. వీడియోలోని మహిళ రామచంద్రరావు వద్దకు పలుమార్లు వివిధ సందర్భాల్లో వేర్వేరు దుస్తుల్లో వచ్చినట్లు కనిపిస్తోంది. విధుల్లో ఉండగానే బాధ్యత కలిగిన పోలీసు అధికారి ఇలా వ్యవహరించడం ఏమిటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం సిఎం సిద్ధరామయ్యకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రరావు వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో రామచంద్రరావుపై పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. కన్నడ నటి, బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలుగా ఉన్న రన్యారావుకు రామచంద్రరావు సవతి తండ్రి. ఆయన అండతోనే రన్యారావు బంగారం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసు అధికారి రామచంద్రరావు తోసిపుచ్చారు. అవి మార్ఫింగ్ చేసిన వీడియోలని తోసిపుచ్చారు. కొందరు పై అధికారులు తనపై కుట్ర పన్ని పదవి నుంచి తప్పించడానికి వాటిని తయారు చేశారని ఆరోపించారు.