Reading Time: 3 minutes

(గత వారం తరువాయి)

తెలంగాణా నర్తకీమణులు తెలుగు, ఉర్దూ, పార్శీ, అరబ్బీ, మరాఠీ భాషలలో పదాలను జావళీలను, తరంగాలను, అష్టపదులను, దుమ్రీలను, గజళ్ళను, రుబాయితులను, అభంగాలను పాడి అభినయించేవారు. హైదరాబాద్‌ను కేంద్రం గా చేసుకొని పరిపాలించిన నవాబులు దేవీడీ కథక్ నర్తనాన్ని పోషించారు. ఉత్తర హిందుస్తాన్ నుండి వచ్చిన ఉస్తాదులు ఈ కథక్ నృత్యాన్ని చేసేవారు. గోల్కొండ పాదూషాలు దక్కణీ నృత్య రీతులను, తెలుగు నర్తన రీతులను పోషించారని చెప్పవచ్చు. హైదరాబాదు నాట్య కళా చరిత్రలో ప్రసిద్ధి పొందిన నర్తకీమణులు భాగమతి, తారామతి, ప్రేమామతి, ప్రదర్శించిన నృత్య రీతులు, పాదూషాల కాలం నాటి కైఫీయత్‌లను పరిశోధించవలసి వుంటుంది.

ఇక మూడవ రకం వినోదం ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను, రసికవాద చింతన ద్వారా మానసిక ఆనందాన్ని కలుగజేసే నర్తనాలు. సామూహిక నర్తనాలుగా పేరొందిన బతకమ్మ, కోలాటంను స్త్రీలు ప్రదర్శిస్తూ వుంటారు. బతు కమ్మ ఆట పార్వతీదేవి ప్రీతి కొరకు ఆడుతారు. ప్రజల వినోదార్థం ప్రదర్శింపబడే జంగం కథ, డప్పుల నృత్యం, జోగాట, గిరిజన నృత్యాలు మొదలగునవి.

తెలంగాణలో పూర్వం ఉండిన నృత్య రీతులు దాదాపుగా అంతరించిపోయాయి. ప్రజా నర్తనం లో భాగంగా వీధి నాటకం, యక్షగానం, కోలా టం, డప్పులు మొదలైన ఇరవై రకాల నాట్య రీతులను బవనీలు, ఉగ్గు గొల్లలు, శారద వాండ్లు, పి చ్చుక గుంట్ల వారు, పాండవులు, ఆరెమరాటీలు, బోడి దాసరులు, సైంధవులు, భరతులు, బాహురూపులు మొదలైన జాతులు వారు ఎందరో ప్రదర్శించే వారు. కరీంనగర్, మంథెన, పెద్దపల్లిలో ప్రసిద్ధి చెందిన నాట్య కళాకారులు వివిధ శుభకార్యాలలో తమ ప్రదర్శనలను ఇవ్వటమే గాకుండా మహారాష్ట్రకు గూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవా రు. వీరికి లక్ష్మాసాని, గిర్రసాని, రామసాని వంటి పేర్లు వుండేవి. ప్రజలు వీరిని గౌరవించే వారు. జానపద కళలను ప్రదర్శించే దాసరులు, చిందు మాదిగలు, బోడి దాసరులు, గుసాడి నర్తకులు నిజామాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్నారు.

యక్షగానాలను ప్రదర్శించే చిందు కళాకారులు తెలంగాణలో అధికంగా ఉండేవారు. దొమ్మరి సాని గెడ పైకి ఎక్కి, గెడ చివరి సూది భాగం పైని తన బొడ్డును ఆనించి, గిరగిరా తిరగటం కొల్హాటం నృత్య రీతికి చెందినది. దీనినే వాడుక భాషలో దొమ్మరి ఆట అని అంటారు. ఈ ఆటకు మతపరమైన సంబంధం ఉండేది. నర్తకి రెండు చేతుల్లోనూ వేప మండలను పట్టుకొని గెడపైన గిర గిరా తిరుగుతూ వేప మండలను నలు దిక్కులా విసురుతుంది అవి ఎటు వైపు పడితే అటు వైపు ఆ సంవత్సరం భూములు చక్కగా పండుతాయని ప్రజల నమ్మకం. అందువలన తెలంగాణలో ప్రతి సంవత్సరం రైతులు ఈ దొమ్మరి వారి చేత ఈ కొల్హాటాన్ని ఆడించేవారు. సమ్మక్క సారక్క జాతరలలోనూ అలాగే ఏడుపాయాల ఎల్లమ్మ జాతరలోనూ, ఇంకా కొమురవెల్లి మల్లన్న జాతరలో నూ, బీరప్ప పూజలలోనూ ప్రదర్శింపబడే నర్తన రీతులన్నీ జానపద నృత్యాలే. తెలంగాణా ప్రజలు బాలనాగమ్మ తందాన తాన కథను పూర్వం ఎంతగానో అభిమానించి ఆదరించారు. ఈ తందాన తాన కథను చెప్పడంలో పిచ్చుక కుంట్ల వారు ప్రసిద్దులు. పాండు రాజు కథను అంటే మహాభారత కథను పాండవులనే తెగవారు ప్రదర్శించే వారు. బీరప్ప కథలను, ఎల్లమ్మ దేవత కథను ఉగ్గు గొల్లలు ప్రదర్శించే వారు. చిరుతల రామాయణం అనే మరొక కళారూపం తెలంగాణా లో బాగా అభివృద్ధి చెందింది.

ప్రస్తుతం తెలంగాణలో అక్కడక్కడా యక్షగానం, దర్బారు ఆట, కథక్, భరతనాట్యం, ఆంధ్ర నా ట్యం, జానపద నృత్యాలు, హిందుస్థానీ, మరాఠీ బాణీ, గంటె, చిందు భాగవతం, చిలుకల భాగవ తం, గిరిజన నృత్యాలను గురించి మాత్రమే చాలామందికి తెలుసు. తెలంగాణలో పేరెన్నిక గల నాట్యానికి ఉపయోగపడే వాద్యాలు కూడా ఉన్నాయి. కంచుతాళలు, గంటలు, మృదంగం, శుద్ద మద్దెల, చండ వాద్యం, వీణ, వేణువు, ముఖవీణ, భేరి, నగారా, టక్కు, టమరం, పంచముఖ వాయిద్యం, స్వర ఘటం, గజ్జెలు మొదలగునవి. సాంప్రదాయ నాట్యంకు తోలుతో కట్టిన గజ్జెల కన్నా, తాడుతో కట్టిన గజ్జెలనే ఉపయోగించాలి. గజ్జెలను ధరించిన నాట్యకారుడు, లేదా నాట్య గ త్తె సరస్వతిదేవీతో సమానం. కనుక గజ్జెలు కట్టిన తర్వాత ఎవరికి నమస్కారం చేయరాదు. ఈ నియమాన్ని మన తెలంగాణలో చక్కగా పాటించినట్లు నటరాజ రామకృష్ణగారి గ్రంధాలనుండి తెలుసుకొనవచ్చు.

జాయప నృత్త రత్నావళిలో మార్గీ, దేశీ నృత్య రీతులను గూర్చి పేర్కొన్నా, వాటిని ఏ విధంగా సాధన చేయాలో అనే వ్యాఖ్యన గ్రంధాలు మనకు లభ్యం కాలేదు. శిష్యులకు గురువు ప్రసాదించే ‘నిధి’ సాంప్రదాయ వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానా లు నాట్యశాస్త్ర గ్రంధాలలో లభించవు. అయితే మనకు లభ్యమవుతున్న కావ్యాలను, రచనలను, శిథిలమైన శిల్పాలను పరిశోధించి, పరిశీలించి, వీటిని మనం సమన్వయపర్చుకోవాలి. మన తెలంగాణా కళారీతులను పునఃసృష్టి చేసుకోవాలి. అంటే నాట్య కళల మూల సూత్రాలను, అలాగే నాట్య సాంప్రదాయాలను క్షుణంగా తెలుసుకొని దేవాలయ శిల్పాలను ముఖ్య ఆధారాలుగా చేసుకోవాలి. ఆనాటి ఆలయాల నిర్మాణం, వాటిలోని శిల్ప కళాకృతి పద్ధతులు, ఆనాటి నృత్య వేదికల ను నిశితంగా పరిశీలించి అధ్యయనం చేయగలిగితే మన ప్రాచీన తెలంగాణా నృత్యరీతులను మ రింత స్పష్టంగా అవగాహన చేసుకొనుటకు వీలవుతుంది. ఈ అధ్యయనానికి వీలు కల్పించే ఆధారాలుగా మన ఆలయాలు ముఖ్య పాత్ర పోషిస్తా యి. అవి పాలంపేటలోని రామప్ప గుళ్ళు, ఘనపురంలోని శిథిల ఆలయ సముదాయాలు, హనుమకొండలోని వేయి స్థంబాల గుడి, వరంగల్ కోటలోని శిథిల శిల్పాలు, మొదలయిన ఎన్నో తెలంగాణ ఆలయాలను మనం పరిశోధించాలి.

– డాక్టర్ గోవిందు సురేంద్ర, స్థపతి

చరిత్ర శాఖ సహాయ ఆచార్యులు