Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ‘ఆపరేషన్ సంరక్షణ’ కార్యక్రమాన్ని రైల్వే భద్రత విభాగం ముమ్మరంగా చేపట్టింది. ప్రయాణీకుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణపై దృష్టి సారించిన ఆర్.పి.ఎఫ్ అగ్ని ప్రమాద నివారణ చర్యలు, నిబంధనలను పాటించడంపై ప్రయాణీకులకు తగు భద్రతా సూచనలు చేస్తూ రైళ్లలోని ప్యాంట్రీ సిబ్బందికి ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో పలు సూచనలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లో ఈ నెల 9 నుండి ఫిబ్రవరి 8 వరకు సమగ్ర అగ్నిమాపక భద్రత, ధూమపాన నిరోధకంపై ప్రచారాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రైళ్లలో మండే స్వభావం ఉన్న వస్తువులను రవాణా చేయడాన్ని నిరోధించడం, రైల్వే స్టేషన్ ప్రాంగణాలలో వాటిని నిల్వ చేయడాన్ని అరికట్టడంతో పాటు ప్రయాణీకుల భద్రతను మరింత పెంచడమే లక్ష్యంగా చేపట్టింది.

ఇప్పటివరకు కొనసాగిన అగ్నిమాపక భద్రతా ప్రచారంలో భాగంగా 43 ఎస్‌ఎల్‌ఆర్ (లగేజ్, బ్రేక్ వ్యాన్ కోచ్‌లు)లు, 25 రైల్వే యార్డులు, వాషింగ్ లైన్లు, పిట్ లైన్లు (కోచ్ నిర్వహణ సౌకర్యం), 17 రైల్వే స్టేషన్లలో భద్రతా లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారు. పొగాకు సంబంధిత అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. మండే, పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, మండే స్వభావం ఉన్న క్యాన్లను అనధికారికంగా రవాణా చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కోచ్ కారిడార్లు, ద్వారాలు, ప్యాంట్రీ మార్గాలను ఖాళీగా ఉంచడానికి, అలాగే వంట చేయడం, ధూమపానంపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేయడానికి తనిఖీలు చేపట్టినట్లు ద.మ.రై ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యుత్ సరఫరాలో భద్రత సమస్యలపై తనిఖీలు

వదులుగా ఉన్న వైర్లు, బైపాస్డ్ ఫ్యూజ్లు, ప్యానెల్ గ్యాప్లను తొలగించడం ద్వారా విద్యుత్ సరఫరాలో భద్రతపరమైన సమస్యలు తలెత్తకుండా తనిఖీలు నిర్వహించారు. పవర్ కార్లలోని జనరేటర్ గదులను సమర్ధవంతంగా నిర్వహించడానికి ఎ.సి మెకానిక్‌లు, ఎస్కార్టింగ్ సిబ్బందిని నియమించి వారి ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రక్షణకు సంబందించి(ఆర్.పి.ఎఫ్ ) 52 తనిఖీలు, మెకానికల్‌కు సంబందించి 29 తనిఖీలు, వాణిజ్యంకు సంబందించి 28 తనిఖీలు, రైళ్ల నిర్వహణకు సంబందించి 21 తనిఖీలు, విద్యుత్‌కు సంబందించి 14 తనిఖీలు, భద్రతకు సంబందించి 6 తనిఖీలు కలిపి మొత్తం 150 తనిఖీలు నిర్వహించినట్లు రైల్వే స్పష్టం చేసింది.

అన్ని కోచ్‌లలో అగ్నిమాపక యంత్రాల లభ్యత, వాటి పని తీరు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవడం జరుగుతోందని పేర్కొంది. స్పష్టమైన సెన్సార్లు, అగ్ని భద్రత, ‘నో స్మోకింగ్’ సంకేతాల ప్రదర్శనను నిర్ధారించడంతో పాటు కోచ్‌లు, ప్యాంట్రీ కారు, పవర్ కార్లలో అగ్ని, పొగ గుర్తింపు వ్యవస్థల పనితీరు పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు సురక్షితమైన, భద్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంతో, దక్షిణ మధ్య రైల్వే అగ్ని ప్రమాదాల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియా, స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రకటనలు చేయడం ద్వారా కూడా అవగాహన కల్పిస్తోందని, రైళ్లలో, రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేయడం శిక్షార్హమైన నేరమని ప్రయాణికులకు గమనించాలని తెలిపింది.