
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ప్రజలను పీడించే పాలన జరుగుతుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ విజయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీ చేయిస్తున్నాడని అన్నారు. సంపత్ కుమార్ వసూల్ రాజా అవతారం ఎత్తారని, ఈ వసూల్ రాజా భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు.
మండల స్థాయి అధికారులను సైతం నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సంపత్ వసూళ్లపై అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు. కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ క్రిశాంక్ మాట్లాడుతూ, మాజీ ఎంఎల్‌ఎ సంపత్ 40 వేల ఓట్లతో ఓడిపోయారని, ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తనను ముట్టుకుంటే అగ్గి అవుతారని ఆయన అన్నారని, అగ్గి కాదు కానీ మట్టి అవుతారని, ఎందుకంటే ఆయన చేసే అక్రమ దందా మట్టి దందానే అని పేర్కొన్నారు. జర్నలిస్టుల మీద సిట్ వేసిన ప్రభుత్వం సంపత్ మీద సిట్ విచారణ వేస్తారా..? అని ప్రశ్నించారు. సిఎం సిట్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మారణాయుధాలతో బెదిరించారని శ్రీ బ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ పిర్యాదు చేసిందని చెప్పారు.