Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం పొరుగుదేశమైన భారత్‌తో సత్సంబంధాలు మాత్రమే కోరుకుంటోందని, గొడవలు కోరుకోవడం లేదని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచేందుకు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్టు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ అన్నారు. ఇటీవల బంగ్లాలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో ఇరు దేశాలమధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించి భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

భారత వ్యతిరేక ఆందోళనలు పూర్తిగా రాజకీయ పరమైనవని, వాటికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఆర్థిక సహకారం బలోపేతం చేసుకోవడంలో భాగంగా భారత్ నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. భారత్‌తో సంబంధాలు దెబ్బతీసేందుకు బయటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై తాత్కాలిక ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.