Reading Time: < 1 minute

న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్టు యాఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పేర్కొంది. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు చైనా, మెక్సికో,రష్యా, టర్కీ మొదలైన దేశాలకు చెందిన వారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులతో సెమీట్రక్కులు నడుపుతున్నట్టు, మరి కొందరు అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించి వారిని అదుపు లోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసా, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది.

ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి సారించింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మందిని అరెస్టు చేసింది. కాలిఫోర్నియా లోని వాణిజ్య ట్రకింగ్ కంపెనీలను లక్షంగా చేసుకొని చేపట్టిన ఆపరేషన్ హైవే సెంటినెల్‌లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 49కి చేరింది.